
Bank Buried In Water: నీటిలో మునిగిపోయిన హిమాచల్ బ్యాంక్.. . కోట్లలో నష్టం అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని రాష్ట్ర సహకార బ్యాంకు పూర్తిగా నీట మునిగింది. బ్యాంకులో ఉన్న లక్షల్లో నగదు, లాకర్లలో భద్రపరిచిన వజ్రాలు, బంగారు నగలు, విలువైన పత్రాలు అన్నీ పాడయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. తునాగ్‌లోని ఈ సహకార బ్యాంకు స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇది చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. వారు తమ డబ్బును ఈ బ్యాంకులో డిపాజిట్ చేయడమే కాకుండా, విలువైన పత్రాలు, నగలను లాకర్లలో భద్రంగా ఉంచుతున్నారు.
వివరాలు
23 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు
జూన్ 20 నుండి జూలై 6 వరకూ హిమాచల్ ప్రదేశ్‌లో విస్తృతంగా భారీ వర్షాలు పడాయి. దీనివల్ల రాష్ట్రంలో మొత్తం 23 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. మండి జిల్లా ఈ వర్షాలు,వరదలతో తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న రెండు అంతస్తుల రాష్ట్ర సహకార బ్యాంకు బిల్డింగ్ వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఉధృతంగా ప్రవహించిన నీటి ప్రభావంతో బ్యాంకు వద్ద ఉన్న ఒక షట్టర్ పైకి లేచిపోయింది, మరో రెండు షట్టర్లు వంకర అయ్యాయి. ఇక వరద నీటితో బ్యాంకులో భద్రపరిచిన లక్షల రూపాయల నగదు,లాకర్లలో ఉన్న నగలు, విలువైన పత్రాలు అన్నీ పూర్తిగా నాశనమై ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
చోరీలు జరగకుండా ఉండేందుకు స్థానికులు చర్యలు
ఇందివల్ల నష్టాన్ని కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన వ్యాపారుల్లో, ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తీవ్రమైన వరదల కారణంగా బ్యాంకులోని వస్తువులు బయటకు కొట్టుకుపోయే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, స్థానికులు వాటిని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు వారే స్వయంగా చర్యలు తీసుకుంటున్నారు.