Page Loader
Himachal pradesh: ముఖం స్కాన్ చేసి వెంటనే రేషన్ పంపిణీ - దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు
దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు

Himachal pradesh: ముఖం స్కాన్ చేసి వెంటనే రేషన్ పంపిణీ - దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద మార్పుగా, ముఖ ప్రామాణీకరణ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించింది. ఈ విధానాన్ని దేశంలో తొలి సారిగా అమలు చేసిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ అందించేందుకు,రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ టెక్నాలజీ, గవర్నెన్స్ విభాగం ఆధ్వర్యంలో,జూన్ 28వ తేదీ నుంచి ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ కొత్త విధానంలో, రేషన్ షాపుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేస్తారు. స్కానింగ్ చేసిన వెంటనే, రేషన్ కార్డులో నమోదైన సభ్యుల పూర్తి వివరాలు డిజిటల్‌గా ప్రత్యక్షమవుతాయి.

వివరాలు 

ఈ పద్ధతితో పారదర్శకంగా, వేగంగా, న్యాయంగా రేషన్ పంపిణీ

ఇది రేషన్ కార్డులోని సభ్యుల పేర్లను ఆధార్‌కు లింక్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ అడ్వైజర్ గోకుల్ బుటెల్ మీడియాతో మాట్లాడుతూ, "ఈ వ్యవస్థలో డీలర్‌ వద్ద ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన కెమెరాతో లబ్ధిదారుల ముఖాలను స్కాన్ చేసి, వారి గుర్తింపు ధృవీకరించబడుతుంది. ఇది సురక్షితమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించబడుతోంది," అని చెప్పారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 19,40,968 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ పద్ధతితో రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, వేగంగా, న్యాయంగా జరిగే అవకాశం ఉంది.