భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి పలువురు చనిపోయారు. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 61మంది చనిపోయినట్లు సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు. వర్షాల కారణంగా రాష్ట్రానిని మొత్తం రూ.10, 000 కోట్ల ఆస్తినష్టం వాటినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరిచండానికి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పడుతుందని ఆయన వివరించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని పాంగ్ డ్యామ్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాంలో నీటిమట్టం పెరగడంతో తరలింపు ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు బుధవారం కాంగ్రా బయలుదేరగా, అక్కడ ఒక డ్యామ్ పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలో వరద పోటెత్తింది. కాంగ్రాలో 100 మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. సిమ్లాలో మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు,కళాశాలలను మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిలిపివేయడం గమనార్హం.