LOADING...
Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 
హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాల కారణంగా జాతీయ రహదారి 707 సహా మొత్తం 109 రహదారులు మూసివేసినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్‌ కేంద్రం (SEOC) సోమవారం ప్రకటించింది. చంబా, కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్, కులు, కిన్నౌర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు తక్కువ నుండి మోస్తరు వరకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

Details

జాతీయ రహదారి బ్లాక్ తో ప్రయాణికుల ఇబ్బందులు

సిమ్లా జిల్లాలోని హత్‌కోటి, సిర్మౌర్ జిల్లాలోని పోంటా సాహిబ్ మధ్య జాతీయ రహదారి 707 బ్లాక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిర్మౌర్‌లో 55 రహదారులు, సిమ్లాలో 23, మండి, కాంగ్రాలో ఒక్కోటి 10, కులులో 9, లాహౌల్, స్పితి, ఉనా జిల్లాల్లో ఒక్కొక్క రహదారిని మూసివేశారు. ఆదివారం సాయంత్రం నుండి గడిచిన 24 గంటల్లో, సిర్మౌర్, బిలాస్‌పూర్, మండి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి.

Details

ఈ ఏడాది 151 మంది మృతి

సిర్మౌర్ జిల్లాలోని నహాన్‌లో 143.5 మిమీ వర్షపాతం, నైనా దేవిలో 130 మిమీ వర్షపాతం కురిసింది. జూన్ 27న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం తక్కువగా నమోదైంది. వర్షాల వల్ల ఈ ఏడాది 151 మంది మరణించగా, రాష్ట్రానికి రూ.1,265 కోట్ల మేర నష్టం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.