Dr. N. Rajam: వయోలిన్‌తో హిందుస్థానీ సంగీతంలో విప్లవం.. పద్మ విభూషణ్ అందుకోనున్న డాక్టర్ ఎన్.రాజం
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 25న 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఐదు పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు డాక్టర్ ఎన్.రాజంకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందించనున్నారు. ఈ గౌరవంపై స్పందించిన డాక్టర్ ఎన్. రాజం.. "నా తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదాల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వివరాలు
గాయకి అంగ్‌తో వయోలిన్‌కు కొత్త గుర్తింపు
1938 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన ఎన్. రాజం గత 50 ఏళ్లుగా ముంబైలోని థానే ప్రాంతంలో నివసిస్తున్నారు. హిందుస్థానీ సంగీతంలో ప్రధానంగా గాత్ర సంగీతానికే ఉన్న ప్రాధాన్యతను వయోలిన్‌కు తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కింది. కేవలం 15ఏళ్ల వయసులోనే వేదికపై ప్రదర్శనలు ప్రారంభించిన ఆమె.. వయోలిన్‌లో 'గాయకి అంగ్' శైలిని అద్భుతంగా పరిచయం చేశారు. ఆమె వినూత్న శైలిని చూసి అనేక మంది వయోలిన్ కళాకారులు తమ పాత విధానాలను విడిచిపెట్టి రాజం శైలిని అనుసరించడం ప్రారంభించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ ఓంకారనాథ్ ఠాకూర్ ఆమెను తన శిష్యురాలిగా స్వీకరించారు. సంగీతంలోనే కాకుండా విద్యారంగంలో కూడా ఎన్. రాజం విశేష కృషి చేశారు.
వివరాలు
జాతీయ పురస్కారాలతో వెలిగిన సంగీత ప్రస్థానం
సంస్కృతంలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె సంగీతంలో డాక్టరేట్ కూడా పొందారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో దాదాపు 40 సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా, ఆర్ట్స్ డీన్‌గా సేవలందించారు. ఆమెకు 1984లో పద్మశ్రీ, 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2004లో పద్మ భూషణ్, 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి. పురుషాధిక్యంగా భావించే సంగీత, విద్యారంగాల్లో తన ప్రతిభతో అర్ధ శతాబ్దానికి పైగా ప్రత్యేక ముద్ర వేసిన మహిళగా ఎన్. రాజం నిలిచారు.
వివరాలు
#పీపుల్స్‌పద్మ అంటే ఏమిటి?
ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన #Peoplespadma (పీపుల్స్ పద్మ) ఇనిషియేటివ్ తర్వాత ఈ పద్మశ్రీ గుర్తింపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ప్రతిభావంతులను గుర్తించేందుకు, ప్రజల స్వీయ నామినేషన్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు.