Manmohan Singh: 'చరిత్ర నాపై దయ చూపుతుంది'.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగం వైరల్ !
ఎవరెన్ని విమర్శలు చేసినా, తన పనిని మౌనంగా కొనసాగిస్తూ, ముందుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ .. నేటి రాజకీయాల్లో 'మిస్టర్ క్లీన్' అని పిలవడంలో సందేహం లేదు. ఆయన మాటలు ఎక్కువగా వినిపించవు, కానీ ఆయన మౌనం తన పనిలోనే గౌరవాన్ని పొందింది. అంతుబట్టని ఆయన ఆలోచనల లోతు, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ప్రధానిగా పదేళ్లు సేవలందించిన కాలంలో, ఆయన మౌనం పై ప్రత్యర్థులు చేసిన విమర్శలు ఎన్నో. అయినప్పటికీ, ఆయన వాటి గురించి ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈ క్రమంలో, 2014 జనవరి 3న ఆయన ప్రధానిగా చివరిగా మీడియా సమావేశంలో పాల్గొని దీనిపై స్పందించారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం
"ప్రస్తుతం ఉన్న మీడియా, పార్లమెంటులోని విపక్షాలు కన్నా, చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజంగా నమ్ముతున్నాను," అని ఆయన అన్న మాటలు. తనం ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలు బయటపెట్టలేకపోయినప్పటికీ, సంకీర్ణ రాజకీయాల ఆవశ్యకతలను గుర్తించి, తాను సరిగ్గా ఎలా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాను అని తనదైన శైలిలో చెప్పి, విమర్శలకు చెక్ పెట్టారు. 2014లో, యూపీయే-2 హయాంలో అనేక శాఖల్లో అవినీతి, కుంభకోణాలు జరిగాయని, ఆయన మౌనం కొనసాగించడం వల్ల ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ ఆరోపణలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. మన్మోహన్ సింగ్ తన జీవితంలో ఎన్నో అనూహ్య పరిణామాలను ఎదుర్కొన్నారు.
నేను పాఠాలు చెప్పుకొంటాను , తప్ప రాజకీయాల్లోకి రాను
ఇక, నెహ్రూ అంతటి వ్యక్తే స్వయంగా పిలిచినా.."నేను పాఠాలు చెప్పుకొంటాను , తప్ప రాజకీయాల్లోకి రాను" అని చెప్పిన మన్మోహన్ సింగ్ అనూహ్యంగా భారత ప్రధాని అయ్యి పదేళ్లపాటు దేశాన్ని పాలించడంలో విజయవంతమైన నాయకుడిగా మారారు. అవిభక్త భారతదేశంలో పాకిస్థాన్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబర్ 26న గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్‌కౌర్ దంపతులకు జన్మించిన మన్మోహన్ చిన్నప్పుడు తల్లి ని కోల్పోయి, తన అమ్మమ్మ జమ్నాదేవి వద్ద పెరిగారు.
డాక్టరేట్ పొందిన తొలి భారత ప్రధాని
గ్రామంలో పాఠశాల లేకపోవడంతో, ప్రతి రోజు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నారు. పదో తరగతి వరకు ఉర్దూ మాధ్యమంలోనే విద్యాభ్యాసం చేశారనే విషయం మన్మోహన్ జీవితంలో ప్రత్యేకతను ఏర్పరచింది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి వలస వెళ్లింది. 1948లో అమృత్‌సర్‌లో స్థిరపడిన తరువాత, ఆయన అక్కడ హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఆయన, 1957లో కేంబ్రిడ్జి వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ఆనర్స్ పూర్తిచేశారు. ఆయన డాక్టరేట్ పొందిన తొలి భారత ప్రధానిగా గుర్తింపును సాధించారు.