HMDA: భారీ అపార్ట్‌మెంట్ల వద్ద వాహనాల పికప్, డ్రాప్‌కు ప్రత్యేక స్థలం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ అపార్ట్‌మెంట్ల వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అపార్ట్‌మెంట్లలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించకపోవడంతో వాటిని రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు పాఠశాలల బస్సుల రాకపోకలతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) చర్యలు చేపట్టింది. క్యూర్ పరిధి వరకు ట్రాఫిక్ పరిస్థితులపై లీ అసోసియేట్స్ సంస్థతో సమగ్ర అధ్యయనం చేయిస్తోంది. ఇప్పటికే పలు సూచనలతో కూడిన మధ్యంతర నివేదికను హెచ్‌ఎండీఏకు అందజేసింది.ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సుమారు 22 జంక్షన్ల అభివృద్ధికి సిఫార్సులు చేసింది.
వివరాలు
కొత్త బస్టాప్‌ల నిర్మాణం
అలాగే మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సేవలను అనుసంధానం చేసేందుకు కొత్త బస్టాప్‌ల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న బస్టాప్‌లను మార్చాలని ప్రతిపాదించింది.
ఉదాహరణకు అమీర్‌పేట జంక్షన్‌లో ఆర్టీసీ బస్సులు ఒకచోట ఆగుతుండగా.. మెట్రో స్టేషన్ మాత్రం జంక్షన్ దాటిన తర్వాత ఉంది.
దీంతో బస్సుల్లో దిగిన ప్రయాణికులు మెట్రో స్టేషన్‌కు చేరుకోవడానికి జంక్షన్ దాటి వెళ్లాల్సి వస్తోంది.
బస్టాప్‌లను మెట్రో స్టేషన్‌కు సమీపంలోకి మారిస్తే ఆర్టీసీ, మెట్రో సేవల మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
భవిష్యత్తులో తప్పనిసరి
భవన నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రత్యేక బిల్డింగ్ బైలాస్ అమల్లో ఉన్నాయి.
భవనాలు నిర్మించే సమయంలో సెల్లార్లు, సెట్‌బ్యాక్‌లు సహా ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
ఇకపై నిర్మించే భారీ అపార్ట్‌మెంట్ల సముదాయాల్లో ప్రైవేటు వాహనాల పికప్, డ్రాప్ కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించడం తప్పనిసరి చేయాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.
ఇందుకు అనుగుణంగా భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ఉమ్టా అధికారి ఒకరు తెలిపారు.