Page Loader
Hyderabad: 'మహా.. మహా' నగరంగా మారనున్న హైదరాబాద్.. హెచ్‌ఎండీఏ స్థానంలో... హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ 
హెచ్‌ఎండీఏ స్థానంలో... హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌

Hyderabad: 'మహా.. మహా' నగరంగా మారనున్న హైదరాబాద్.. హెచ్‌ఎండీఏ స్థానంలో... హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ త్వరలో 'మహా.. మహా' నగరంగా మారనుంది. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) స్థానంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (హెచ్‌ఎంఆర్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగర పరిసరాల్లో రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం పురపాలక ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఈ నిర్ణయాన్ని గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా సంబంధిత శాఖకు ఆదేశాలు అందించారు.

వివరాలు 

హెచ్‌ఎంఆర్‌ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లు 

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ పరిధిలో మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్‌ఎంఆర్‌ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలుండగా హెచ్‌ఎంఆర్‌లో వీటితో పాటు నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లాలు కూడా హెచ్‌ఎంఆర్‌లో చేరాయి.

వివరాలు 

రెవెన్యూ గ్రామాలకు అదనంగా మరిన్ని గ్రామాలు

హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో 'ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ' ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని, 36 రెవెన్యూ గ్రామాలను హెచ్‌ఎంఆర్‌ పరిధిలో నుంచి మినహాయించారు. కొత్తగా ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, అయితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కేవలం మూడు రెవెన్యూ గ్రామాలే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాలకు అదనంగా మరిన్ని గ్రామాలు కలిశాయి.