LOADING...
Home Minister Anitha: శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన
శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన

Home Minister Anitha: శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పోలీస్ శాఖకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లో అన్ని పోలీస్‌ స్టేషన్లకు నూతన వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయని ఆమె ప్రకటించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హోం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, దానిని మళ్లీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Details

ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తాం

పోలీసులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.5 కోట్లు సీఎస్ఆర్ నిధుల రూపంలో అందించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖలో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్రం లా అండ్ ఆర్డర్ విషయంలో దేశంలో రెండో స్థానంలో నిలిచిందని గర్వంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మొత్తం లక్ష కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

Details

నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయాలి

బస్టాండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు, కీలక కూడళ్లలో ఈ కెమెరాలను అమర్చుతున్నామని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేస్తున్నామని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన హోం మంత్రి, గత ఐదేళ్లలో పోలీస్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. "మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆ లోటును తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం. నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.