
Fire break out:మహారాష్ట్రలో భయానక అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పలు కంపెనీల గోదాములను చుట్టుముట్టడంతో పరిస్థితి తీవ్రతరంగా మారింది.
ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు 22 గోదాములు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ గోదాముల్లో రసాయన పదార్థాలు, ముద్రణ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటీన్ పౌడర్లు, కాస్మెటిక్ ఉత్పత్తులు, బట్టలు, షూస్, ఫర్నిచర్, అలాగే మండపం అలంకరణ సామాగ్రి తదితర వస్తువులు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.
మంటలు ఒక్కసారిగా వ్యాపించి తీవ్ర స్థాయిలో నష్టాన్ని చేకూర్చాయి.
Details
మంటలను అదుపులోకి తేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ బ్రిగేడ్, భివండీ, కల్యాణ్ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటల అదుపులోకి తెచ్చేందుకు నిమగ్నమయ్యాయి.
స్థానిక పోలీసులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే మంటల పొగ స్పష్టంగా కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రారంభంలో ఐదు కంపెనీల గోదాముల్లో మంటలు చెలరేగగా, అనంతరం మండపం డెకరేషన్ స్టోరేజ్ వరకూ విస్తరించి మొత్తం 22 గోదాములను చుట్టుముట్టినట్లు సమాచారం.
ఇప్పటివరకు ప్రాణనష్టం గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.