LOADING...
Bihar: బీహార్‌లో ఘోర విషాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది రోగుల మృతి
బీహార్‌లో ఘోర విషాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది రోగుల మృతి

Bihar: బీహార్‌లో ఘోర విషాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది రోగుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
07:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్రహ్మపుర ప్రాంతంలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన పలువురు రోగుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

ఐసీయూ వార్డులో మొదలైన మంటలు

ఆసుపత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డులో తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మంటల కంటే వేగంగా వ్యాపించిన దట్టమైన విషపూరిత పొగ ఆసుపత్రి భవనం అంతటా కమ్మేయడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాథమిక విచారణలో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

20 మందికి పైగా రోగులు సేఫ్ 

ఉదయం సుమారు 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. దాదాపు డజను అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం 20మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక అధికారి ఆర్.ఎన్. పాండే ఘటనపై మాట్లాడుతూ, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. తమ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఐసీయూ వార్డు మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని చెప్పారు. 20మందికి పైగా రోగులను రక్షించినప్పటికీ, 10మంది మరణించినట్లు నివేదికలు అందాయని వెల్లడించారు.

Advertisement

వివరాలు 

ఆసుపత్రి సిబ్బంది పారిపోయారని ఆరోపణలు

ఈ ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నాయి. ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వాపోయాడు. ఘటన జరిగిన వెంటనే వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది రోగులను పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోయారని పలువురు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement