TVK Vijay: తమిళనాడులో హాట్ టాపిక్.. డీఎంకే, ఏఐడీఎంకే బలమైన కోటల్లో విజయ్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ విడుదల చేశారు. చెన్నైలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, టీవీకే మధ్యే ఎన్నికల పోరు ఉండబోతుందని విజయ్ వ్యాఖ్యానించారు. అయితే డీఎంకే, ఏఐడీఎంకేలకు బలమైన పట్టున్న నియోజకవర్గాలనే విజయ్ ఎంచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాలు
ఓటర్లు సుమారు 20 నుంచి 25 శాతం వరకు
పెరంబూర్ నియోజకవర్గం సామాజిక సమీకరణ పరంగా కీలకంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఎస్సీ వర్గం ఓటర్లు సుమారు 20 నుంచి 25 శాతం వరకు ఉన్నారు. క్రిస్టియన్లు 8 నుంచి 12 శాతం, ముస్లిములు 10 నుంచి 15 శాతం వరకు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి స్థిరపడిన తెలుగు ఓటర్లు 20 నుంచి 25 శాతం వరకు ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, డీఎంకే నాలుగు సార్లు, ఏఐడీఎంకే రెండు సార్లు విజయం సాధించాయి. దీంతో పెరంబూర్‌ను డీఎంకే కంచుకోటగా భావిస్తారు. అలాంటి కీలక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
తెలుగు ఓటర్లు 12 నుంచి 16 శాతం వరకు
ఇక తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం విషయానికి వస్తే, ఇక్కడ బీసీ వర్గం ఓటర్లు సుమారు 40 శాతం వరకు ఉన్నారు. ఎస్సీ వర్గం ప్రభావం కూడా గణనీయంగా ఉంది. తెలుగు ఓటర్లు 12 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. గత ఆరు ఎన్నికల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మూడేసి సార్లు విజయం సాధించడంతో ఇక్కడ పోటీ సమానంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే, ఏఐడీఎంకేలకు బలమైన పట్టు ఉన్న పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచే విజయ్ పోటీ చేయడం అందరిలో ఆసక్తి పెంచుతోంది. రెండు కీలక నియోజకవర్గాలను ఎంచుకోవడం ద్వారా తన రాజకీయ ప్రభావాన్ని చాటుకోవాలనే వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.