LOADING...
Gandikota: గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్‌ బోట్లు
గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్‌ బోట్లు

Gandikota: గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్‌ బోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

శత్రు దుర్భేద్యమైన గండికోట ప్రదేశం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే అందాలు మనసును మైమరిపిస్తాయి. పచ్చని లోయలు, ప్రకృతి సౌందర్యం ఇక్కడ ప్రతి మూలలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కట్టడాలు, కోటలు ఇక్కడ పాలించిన రాజులు, రాజవంశీయుల పరాక్రమం, ఆ కాలంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రకృతిసౌందర్యంతో మంత్రముగ్ధులను చేసే పెన్నా లోయ ఈ ప్రాంతానికి విశేష ఆకర్షణ. ఇలాంటి అద్భుత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వెన్నెల రాత్రుల్లో ఈ లోయ అందాలను ఆస్వాదించేలా కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది.

పెన్నా

"ఇండియా గ్రాండ్ కాన్యన్"గా పేరుగాంచిన పెన్నా లోయ

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గండికోట పర్యాటక ప్రదేశంగా మారింది. ఇక్కడ సాహస క్రీడలు,ప్రకృతి సందర్శనలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. "ఇండియా గ్రాండ్ కాన్యన్"గా పేరుగాంచిన పెన్నా లోయను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఇకపై ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. పర్యాటకులు కుటుంబ సభ్యులు,స్నేహితులతో కలిసి పెన్నా నదిపై జలవిహారం చేసేందుకు వీలు కల్పిస్తోంది.ఇందుకోసం కేరళ తరహాలో ఇక్కడ హౌస్‌బోట్లు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది. హౌస్‌బోట్‌ అనేది నీటిమీద తేలుతూ ప్రయాణించే చిన్న ఇల్లు వంటిది.కేరళ బ్యాక్‌వాటర్లలో ఈ తరహా నౌకాయానం విశేష ప్రజాదరణ పొందింది.

ప్రాజెక్ట్‌ 

10 నుండి 12 కిలోమీటర్ల జలవిహారం ప్రాజెక్ట్‌ 

ఇలాంటి హౌస్‌బోట్లు గండికోట ప్రాంతంలో ప్రవేశపెడితే పర్యాటకులు చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని,ప్రశాంత వాతావరణాన్ని సన్నిహితంగా ఆస్వాదించగలరు. హౌస్‌బోట్‌లలో భోజన వసతి, బస సదుపాయాలు కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రయాణికులు తమ ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ పెన్నా లోయ అందాలను వీక్షించవచ్చు. జలాశయం నుంచి గండికోట పెన్నా లోయ మీదుగా మైలవరం జలాశయం వరకు సుమారు 10 నుండి 12 కిలోమీటర్ల మేర హౌస్‌బోట్‌ ప్రయాణం చేయగలరు.