Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం భూమిలేని నిరుపేద కూలీల కోసం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని ప్రకటించింది.
దీని ద్వారా వారికి ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యం.ఈ పథకం జనవరి 26న ప్రారంభమవుతుందని ప్రకటించగా, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం కీలకంగా మారింది.
గ్రామసభల ద్వారా తుది జాబితాను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూమిలేని కూలీలకు ప్రతి ఏడాది రూ.12,000 ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
ఏడాదిలో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనులు చేసినవారు మాత్రమే అర్హులుగా గుర్తించబడతారు.
క్షేత్రస్థాయి సర్వే అనంతరం తుది వివరాలు ప్రకటిస్తారు.
వివరాలు
పథకం ద్వారా 10 లక్షల మంది కూలీలకు లబ్ధి
గ్రామసభల ద్వారా ముసాయిదా జాబితాను తయారు చేసి, తుది జాబితా సిద్ధం చేయడమే అధికారులు ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే, రైతు భరోసా పథకానికి చెందిన లబ్ధిదారులను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు.
మరోవైపు, ప్రతిపక్షం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎకరంలోపు భూమి కలిగిన రైతులను కూడా పథకానికి చేర్చాలని డిమాండ్ చేసింది.
పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి.