Watermelon : ముంబైలో షాకింగ్ ఘటన.. పుచ్చకాయలపై మళ్లీ చర్చ.. రాత్రిపూట తినడం సేఫేనా?
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఒక వేసవి సాయంత్రం. కుటుంబం కలిసి బిర్యానీ విందు, తర్వాత వాటర్‌మిలన్ ముక్కలు తినడం... అంతా సాధారణంగానే సాగింది. కానీ కొన్ని గంటల తర్వాత ముంబైకి చెందిన ఒక కుటుంబంలో నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది అన్నది ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియలేదు. ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నా, అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు. వాటర్‌మెలన్, అనుమానాస్పద దాల్చిన చెక్క లాంటి మిశ్రమం, అలాగే బిర్యానీ నమూనాలను పరీక్షలకు పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. మనం "ఆరోగ్యకరం" అనుకుంటూ తింటున్న ఆహారం నిజంగా ఎంత సురక్షితం?
వివరాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..
Onmanorama నివేదిక ప్రకారం, ఆరోగ్య నిపుణులను ఉటంకిస్తూ, వాటర్‌మెలన్ రంగు, రుచి మెరుగుపరచడానికి వాడే కొన్ని రసాయనాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని చెబుతున్నారు. సహజంగా పండిన వాటర్‌మెలన్ మోస్తరు ఎరుపు రంగులో ఉంటుంది. కానీ కట్ చేసినప్పుడు చాలా ప్రకాశవంతమైన లేదా గాఢమైన ఎరుపు రంగు కనిపిస్తే, కృత్రిమ రంగులు వాడిన అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పండ్లు మన ఆహారంలో అత్యంత సురక్షిత భాగంగా భావిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా రోజుకు కనీసం ఐదు సర్వింగ్స్ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తోంది.
వివరాలు
ఆ పండ్ల వెనుక దాగి ఉన్న పద్ధతి ఇదే..
వాణిజ్య లాభాల కోసం త్వరగా సరఫరా చేయడం, ఒకేలా కనిపించే రూపం, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయడం కోసం పండ్లను సహజంగా చెట్లపై పండించకుండా, కృత్రిమ రసాయనాలతో పండిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం, కొంతమంది వ్యాపారులు ఇప్పటికీ చట్టవిరుద్ధమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఎథెఫాన్ వంటి రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచి వేగంగా పక్వం వచ్చేలా చేస్తున్నారు. ఏప్రిల్ 16న జారీ చేసిన ఆదేశాల్లో, మార్కెట్లు, నిల్వ కేంద్రాలు, పంపిణీ వ్యవస్థలపై తనిఖీలు పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ రకమైన రసాయనాల వాడకం వల్ల మింగడంలో ఇబ్బంది, వాంతులు, చర్మంపై గాయాలు, దీర్ఘకాలంలో అవయవాలపై ప్రభావం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివరాలు
ప్రమాదకరమైన రసాయనాల ప్రభావం..
పలు శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమంగా పండించిన పండ్లలో రుచి, గుణం, పోషక విలువలు తగ్గిపోతాయని, అలాగే ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలు ఉండొచ్చని తెలిపింది. సాధారణంగా ఉపయోగించే రసాయనాల్లో ముఖ్యంగా ఇవి ఉన్నాయి: ఎథెఫాన్: పండ్లలోకి ప్రవేశించి ఎథిలీన్ వాయువును విడుదల చేసి పక్వాన్ని వేగవంతం చేస్తుంది. కాల్షియం కార్బైడ్: ఎసిటిలీన్ వాయువును విడుదల చేసి పండ్లు త్వరగా పక్వం అయ్యేలా చేస్తుంది. కానీ ఇది తక్కువ ఖర్చుతో లభించినా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.