Tar Roads: గ్రామీణాభివృద్ధికి భారీ బడ్జెట్.. తెలంగాణలో 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ప్రతీ గ్రామానికి తారు రోడ్డు నిర్మించి, సమీప మండల కేంద్రాలతో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.12,000 కోట్లతో 17,300 కిలోమీటర్ల మేర పటిష్ఠమైన తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత తరహాలోని 10 టన్నుల సామర్థ్యంతో కూడిన రోడ్ల స్థానంలో, 30 టన్నుల భారాన్ని మోయగల రోడ్లు నిర్మించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం అవుతోంది.
రూ.12 వేల కోట్ల వ్యయం
రహదారులను బలంగా నిర్మించి, అధిక వాహన రాకపోకను తట్టుకునేలా చేసే ఉద్దేశంతో పనులు చేయనున్నారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రహదారుల నిర్వహణకు గతంలో తగినంత నిధులు లభించకపోవడం వల్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఇటీవల భారీ వర్షాలు పడి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మరింత నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేసేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా నిర్మాణ సంస్థలకు పదేళ్లపాటు రహదారుల నిర్వహణ బాధ్యత అప్పగించనుంది.