Vizag Stock Market Scam: విశాఖలో భారీ మోసం.. స్టాక్ మార్కెట్ పేరిట రూ.6.5 కోట్లు నొక్కేశారు!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఓ కుటుంబం పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిన ఘటన బయటపడింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి, సుమారు రూ.6.5 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం. నిందితులు "మీ తరఫున స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తాం" అంటూ పెట్టుబడిదారులను ఆకర్షించారు. వచ్చిన లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామని చెప్పి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అయితే నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో పాటు, అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మోసానికి పాల్పడిన సూర్య నారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, కుమారుడు ఎన్. భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.