Page Loader
అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ
దుర్గభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలూ చోరీ

అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 05, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల చందానగర్‌లోని ఓ గోల్డ్ షాపులో దొంగలు గోడకు రంధ్రం చేసి, ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్‌లో మరో చోరీ జరగడం గమనార్హం. మల్కాజ్‌గిరి గౌతంనగర్‌లోని దుర్గాభవానీ ఆలయంలోని 20 తులాల అమ్మవారి బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులను అపరించారు. అంతేకాకుండా కౌంటర్‌లోని రూ. 80 వేల డబ్బు, హుండీలోని సొమ్మును దోచేశారు. తొలుత అమ్మవారి గోడకు కన్నం పెట్టిన దుండగులు, లోపలికి ప్రవేశించి అమ్మవారి నగలు, డబ్బును దొంగలించారు. పోలీసులకు చిక్కకుండా సీసీ ఫుటేజీలతో సహా దొంగలు దోచేయడం విస్మయానికి గురి చేస్తోంది.

DETAILS

రెండింట్లోనూ గోడలకు కన్నం వేయడం ద్వారానే చోరీలు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే క్లూస్ టీం సాయంతో చోరీకి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. జులై 31న అర్థరాత్రి చందానగర్‌లోని గాంధీ విగ్రహం వెనుక రాజ్ లాల్ చంద్ పాన్ బ్రోకర్ జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డారు. పక్కనే ఉన్న వస్త్ర దుకాణంలోకి ప్రవేశించిన నేరగాళ్లు, దాని గుండా కన్నం వేసి బంగారం దుకాణంలోకి వచ్చి 40 తులాల బంగారాన్ని మాయం చేశారు. తాజాగా జరిగిన ఈ రెండు చోరీల్లోనూ నిందితులు గోడలకు కన్నం వేయడం ద్వారానే నేరాలకు పాల్పడ్డారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.