Page Loader
Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!
ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!

Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్‌జీ, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1500 మందికి నేరుగా ఉపాధి లభించే అవకాశం ఉంది. మే 8వ తేదీన ఈ ప్లాంట్‌కు భూమిపూజ జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో ఎల్‌జీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంవోయూ చేసుకోగా, ప్రభుత్వం సంస్థకు 247 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకరించింది. శ్రీసిటీలో నెలకొననున్న ఈ ప్లాంట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, కంప్రెషర్లు వంటి గృహోపకరణాల తయారీ జరగనుంది. దీనిద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.

Details

అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

ఇక మరోవైపు, ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి చేసింది. అమరావతిలో ప్రధాన కేంద్రంగా హబ్ ఏర్పాటు కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ హబ్‌లు ఏర్పాటు చేయనున్నది. వీటిని ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హబ్‌ల కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఐదు ప్రాంతీయ హబ్‌లు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఏర్పాటు కానున్నాయి. ప్రతి హబ్‌ నిర్వహణకు ప్రైవేట్ సంస్థలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా సీడ్ క్యాపిటల్ అందించనుండగా, AP ఇన్నోవేషన్ సొసైటీ (APIS) నుండి గ్రాంట్లు కూడా లభించనున్నాయి.

Details

గణనీయంగా ఉపాధి అవకాశాలు

APIS ఈ ప్రాంతీయ హబ్‌ల నిర్వహణకు ఆసక్తి కలిగిన సంస్థల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. APIS సీఈవో వాటిని పరిశీలించి, ఐటీ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థలతో అమలుకు చర్యలు తీసుకుంటారు. ఈ హబ్‌లు పూర్తిస్థాయిలో పనిచేసే వరకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటవుతుంది. ఇందులో డీఐసీ జీఎం, డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. టాస్క్‌ఫోర్స్ ఈ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఇలా పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ, ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా గణనీయమైన అడుగులు వేస్తోంది.