తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులూ భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి ఆవర్తనం సగటున సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మరో వైపు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది.
రానున్న మూడు రోజులూ ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు
మంగళవారం వర్షం పడనున్న జిల్లాలు : నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. బుధవారం వర్షం కురవనున్న జిల్లాలు : ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలు పడనున్నాయి. గురువారం వర్షాలు పడే జిల్లాలు : ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడకక్కడ వానలు కురిసే అవకాశముంది.