Two Thousand Crore fraud: అస్సాంలో భారీ స్టాక్ ట్రేడింగ్ స్కాం.. ప్రముఖ నటి అరెస్ట్
అస్సాంలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో ప్రముఖ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా అరెస్టయ్యారు. గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) వారిని అదుపులోకి తీసుకుంది. అస్సాం పోలీసులు ఇటీవల వెలుగులోకి తెచ్చిన రూ.2,000 కోట్ల స్కామ్‌లో ప్రజలను పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసగాళ్లు వ్యాపారాలు నడిపినట్లు సమాచారం. వారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజలను మోసగించి సొమ్ము వసూలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశాల్ ఫుకాన్ కూడా అరెస్టు అయ్యాడు.
నాలుగు నకిలీ కంపెనీలు నెలకొల్పి భారీ మోసం
విశాల్ ఫుకాన్ 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వసూలు చేస్తానని ప్రజలను నమ్మబలికాడు. ఈ క్రమంలో నాలుగు నకిలీ కంపెనీలు నెలకొల్పి, అస్సాం చిత్ర పరిశ్రమలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. ఈ కేసులో బోరా దంపతులతో పాటు మరికొందరిపై కూడా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విశాల్ అరెస్టు తరువాత, బోరా దంపతులను విచారణకు పిలిచినా, వారు హాజరుకాకపోవడంతో, లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. వారి అరెస్టుతో ఈ స్కామ్‌కి సంబంధించిన మరింత సమాచారం బయటపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.