ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం
ప్రపంచ ఆహార సూచీ-2023లో భారత్ స్థానం పట్ల కేంద్రం ఆక్షేపిస్తోంది. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం 111వ స్థానంలో నిలవడంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 125 దేశాల్లో భారత్ 111 ర్యాంకులో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే సూచీలోనే లోపభూయిష్ట విధానాలున్నాయని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది తప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ అని, దురుద్దేశపూర్వకంగానే ఇచ్చినట్లుగా ఉందని వ్యతిరేకించింది. సంక్షోభంలో నిండా మునిగిన పాకిస్థాన్ (102), శ్రీలంక (60), బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) భారతదేశం కంటే చాలా మెరుగైన స్థానాల్లో నిలవడం పట్ల సంభ్రామాశ్చర్యాలను వ్యక్తమవుతోంది. ఆకలి విషయంలో 28.7 స్కోరుతో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు ప్రపంచ నివేదిక బట్టబయలు చేసింది.
కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ అంటూ కొట్టివేత
ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది.ఇది తప్పుడు పద్ధతులతో రూపొందించిన సూచీ అని కొట్టిపారేసింది. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ మేరకు పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడాన్ని ఖండించింది. బాలల్లోని 7.2 శాతం పౌష్టికాహార లోపాన్ని 18.7గా చిత్రీకరించింది.ఈ సూచీ విడుదలలో దురుద్దేశాలు ఉన్నట్లు కేంద్రం కుండబద్దలు కొట్టింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో కింద నుంచి టాప్ లో ఉన్నాయి. భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉందని నివేదిక వెల్లడించింది. 5ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతంగా, 15-24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత బాధితుల సంఖ్య 58.1 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.