Loading...
Hyderabad Air Pollution: ఢిల్లీని తలపిస్తున్న హైదరాబాద్‌.. ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం
ఢిల్లీని తలపిస్తున్న హైదరాబాద్‌.. ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం

Hyderabad Air Pollution: ఢిల్లీని తలపిస్తున్న హైదరాబాద్‌.. ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన వాతావరణానికి పేరుగాంచిన నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దేశ రాజధాని దిల్లీలో కనిపించే పరిస్థితులు హైదరాబాద్‌లోనూ నెలకొంటున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది.ముఖ్యంగా ఐటీ కారిడార్‌ పరిధిలోని ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా మారుతున్నాయి. శేరిలింగంపల్లి,మణికొండ,గచ్చిబౌలి పరిసరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కాలుష్య గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరం మొత్తం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 410గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిని సూచిస్తోంది. సాధారణంగా పీఎం 2.5కు సురక్షిత పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా.. ప్రస్తుతం ఆ స్థాయి 278 మైక్రోగ్రాములకు చేరింది.

వివరాలు 

326మైక్రోగ్రాములుగా పీఎం 10 సురక్షిత పరిమితి

ఇక పీఎం 10 సురక్షిత పరిమితి 100మైక్రోగ్రాములు ఉండగా.. ప్రస్తుతం 326మైక్రోగ్రాములుగా నమోదైంది.

గాలిలో ఇంత పెద్ద మొత్తంలో సూక్ష్మ ధూళి కణాలు ఉండటం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాంతాల వారీగా చూస్తే డిఫెన్స్‌ కాలనీలో అత్యధికంగా 685 AQI నమోదైంది.శేరిలింగంపల్లిలో 666, మణికొండలో 602,యాంబియన్స్‌ ఫోర్ట్‌లో 596,ఎన్‌బీటీ నగర్‌లో 582గా కాలుష్య సూచీ నమోదైంది.

ముఖ్యంగా ఐటీ సంస్థలు,భారీ నిర్మాణ పనులు, నిరంతరం రద్దీగా ఉండే రహదారులతో కూడిన పశ్చిమ హైదరాబాద్‌లో కాలుష్యం తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వాహనాల రద్దీ,నిర్మాణ పనుల వల్ల గాలిలోకి చేరుతున్న దుమ్ము,వాహనాల నుంచి వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

వివరాలు 

శ్వాసకోశ సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో ఆస్తమా, బ్రాంకైటిస్‌తో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దగ్గు, గొంతులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి. రోడ్లపై వ్యాయామాలు చేయకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే N95 మాస్క్‌ ధరించాలని చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కాలుష్య నియంత్రణ చర్యలు

మరోవైపు నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిర్మాణ రంగ కార్యకలాపాలు, రహదారులపై పేరుకుపోతున్న దుమ్ముపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము వ్యాపించకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం, వాహనాల ఉద్గారాల తనిఖీలను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టాలి.

హైదరాబాద్‌లో గాలి నాణ్యత మరింత దిగజారకుండా అధికారులు వెంటనే స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

ADVERTISEMENT