Hyderabad: నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు
శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లు కుటుంబసభ్యులు,సమాజం నుండి చిన్నచూపు ఎదుర్కొంటున్నారని, వారికి తగిన అవకాశాలు కల్పిస్తే వారు కూడా తమ ప్రతిభను నిరూపించగలరని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్‌జెండర్ల ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అంకితభావంతో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవో
ట్రాన్స్‌జెండర్లు పెళ్లిళ్లలో లేదా దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వ్యభిచారంలో పాల్గొనడం వంటి పరిస్థితులు సరైన అవకాశాలు లేకపోవడం వల్లనే ఏర్పడ్డాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గౌరవప్రదంగా జీవనోపాధి పొందే అవకాశాలను కల్పిస్తే వారు మారిపోతారని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవోను తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు స్థాయిలో వారి సేవలను వినియోగిస్తున్నామని, శిక్షణ పూర్తి చేసిన ట్రాన్స్‌జెండర్లు సోమవారం నుంచి విధుల్లో చేరుతారని తెలిపారు. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ అధికారులను అభినందిస్తూ, ఈ ప్రయత్నం సమాజంలో సానుకూల మార్పుకు నాంది అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.