LOADING...
CtrlS: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. AI బూమ్‌తో CtrlS దూకుడు.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ
రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ

CtrlS: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. AI బూమ్‌తో CtrlS దూకుడు.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ హైదరాబాద్‌కు మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ డేటా సెంటర్ సంస్థ CtrlS డేటా సెంటర్స్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టేందుకు కెనడాకు చెందిన కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPP Investments) ముందుకొచ్చింది. మొత్తం రూ.7 వేల కోట్ల పెట్టుబడికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వివరాలు 

కంపెనీ ప్రీ-మనీ వాల్యుయేషన్ రూ.44,914 కోట్లు

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పటికే CtrlSలో రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెట్టి 8.2 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకుంది. ఈ లావాదేవీ సమయంలో కంపెనీ ప్రీ-మనీ వాల్యుయేషన్ రూ.44,914 కోట్లుగా నమోదైంది. అంతేకాకుండా ఇప్పటికే పెట్టుబడి చేసిన మొత్తానికి అదనంగా మరో రూ.3 వేల కోట్లను దేశవ్యాప్తంగా అత్యాధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందుకోసం ఇరు సంస్థలు సంయుక్తంగా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.

వివరాలు 

నవీ ముంబైలో తొలి హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటు

ఈ ఒప్పందంపై CtrlS వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ పిన్నపురెడ్డి స్పందిస్తూ.. భారతదేశంలో AI ఆధారిత సేవలకు డిమాండ్ కొత్త దశలోకి చేరుకుందని చెప్పారు. అంతర్జాతీయ హైపర్‌స్కేలర్లు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ వస్తోందని తెలిపారు. ఈ భాగస్వామ్యంతో నిర్మించే తొలి హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నవీ ముంబైలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం CtrlS సంస్థ దేశవ్యాప్తంగా ప్రణాళికలు,అనుమతులు,నిర్మాణ దశల్లో కలిపి సుమారు 4.4 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని దాదాపు 5 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివరాలు 

చందన్‌వెల్లి, ఫ్యూచర్ సిటీలలో కంపెనీ భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ల నిర్మాణం 

ప్రస్తుతం 11 నగరాల్లో ఉన్న కార్యకలాపాలను వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో 20 నుంచి 22 నగరాలకు విస్తరించనుంది. హైదరాబాద్ శివార్లలోని చందన్‌వెల్లి, ఫ్యూచర్ సిటీలలో కంపెనీ భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. చందన్‌వెల్లిలో 1.4 గిగావాట్ల సామర్థ్యంతో, ఫ్యూచర్ సిటీలో 2 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు తెలంగాణను దేశంలోని ప్రధాన డిజిటల్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

వివరాలు 

3 వేల మంది ఉద్యోగుల పెంపే లక్ష్యం 

కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం సంస్థలో 1,850 మంది ఉద్యోగులు ఉండగా, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 3 వేల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనుంది. దీంతో ముఖ్యంగా సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement