Page Loader
Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు
కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు'

Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 10, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పరువు హత్య జరిగింది. తమ కూతురును మరో కులానికి చెందిన వ్యక్తి ప్రేమించడం జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు, ప్రేమికుడ్ని ఘోరంగా హత్య చేశారు. మేడ్చల్‌ మల్కాజిగి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ దారుణం కలకలం సృష్టించింది. ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడ శ్రీ లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన 18 ఏళ్ల కరణ్‌ నాయక్‌ నీరు సరఫరా చేసే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. అయితే ఇతని తండ్రి గతంలో మరణించగా, తల్లి యాదిబాయ్‌తో కలిసి స్థానికంగా నివాసముంటున్నాడు. ఇదే కాలనీలో నివాసముంటున్న 15 ఏళ్ల బాలికతో కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

details

సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో మొదలైన సమస్య

అయితే ఈ ఇద్దరు ప్రేమికులు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ప్రేమ విషయం బాలిక పెద్దలకు తెలియడంతో కరణ్‌ను చాలా సార్లు మందలించారు. ఇలాంటివి వద్దని సర్ది చెప్పారు. మరో సామాజికవర్గానికి చెందిన యువకుడు తమ కుమార్తెను ప్రేమించాడన్న విషయాన్ని తట్టుకోలేని బాలిక తల్లిదండ్రులు, చివరకు ఆ యువకుడిని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశారు. అసలేం జరిగింది : బుధవారం బాలిక తల్లిదండ్రులు ఓ శుభకార్యానికి వెళ్లిన క్రమంలో బాలిక ఇంట్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో కరణ్ అర్ధరాత్రి నేరుగా బాలిక ఇంటికెళ్లాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు ద్వారా తెలుసుకున్న బాలిక కుటుంబీకులు హుటాహుటిన తిరిగివచ్చేశారు.

details

దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయిన కరణ్

ఆగ్రహావేశాలతో ఉన్న బాలిక తల్లిదండ్రులు, కరణ్‌ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టేశారు. స్థానికంగా తెలిసిన వారిని పిలిపించుకుని ఆకస్మికంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బాలుడ్ని వివస్త్రను చేసి తాళ్లతో కట్టేసి యువకుడిని చితకబాదారు. అతడి రహస్యభాగాలపై కారం చల్లుతూ కర్రలతో బాదుతూ గంట పాటు చిత్రవధకు గురిచేశారు. దీంతో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటకే ప్రాణాలు వదిలేశాడు. సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జ్‌ సీఐ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు అమ్మాయి తల్లిదండ్రులతో సహా మరో 9 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్థానికంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.