Air pollution: కాలుష్య కోరల్లో హైదరాబాద్.. వాహన రద్దీ, పరిశ్రమల ప్రభావమే కారణం
హైదరాబాద్‌లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలుష్య నియంత్రణలో లోపాల అని చెప్పొచ్చు. తాజా నివేదికల ప్రకారం, దేశంలోని అత్యంత కలుషిత నగరాల్లో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న వాహనాల కారణంగా గాలిలో ధూళి, ధుమ్ము కణాలు అధికమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో లోపాల కారణంగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం, హైదరాబాద్‌లో గాలి నాణ్యత సూచిక 170గా నమోదైంది, ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా ఉంది.
ఏడో స్థానంలో హైదరాబాద్
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యానికి గురైన నగరాల జాబితాలో దిల్లీ 567 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌తో మొదటి స్థానంలో ఉంది. పాట్నా, కోల్‌కతా, లక్నో, జైపూర్, భోపాల్ తర్వాతి స్థానాల్లో ఉండగా, హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యం ఏమిటంటే హైదరాబాద్‌తో పోలిస్తే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉంది. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ మండలి చర్యలు సరిపోకపోవడం వల్ల గాలి కాలుష్యం తీవ్రమవుతోంది. పరిశ్రమల వ్యర్థాలు, వాహనాల కర్బన ఉద్గారాలు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోకపోతే, నగర ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.