Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి అవసరమైన రుణాల సమీకరణ, ఫేజ్-2 విస్తరణ నిర్మాణ వ్యయం, ఆర్థిక వనరుల సమీకరణ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను 'ఎస్‌బీఐ క్యాప్స్' సంస్థకు అప్పగించనున్నారు. ఈ అంశంపై సోమవారం రాత్రి దిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.
వివరాలు
పలు అంశాలపై ఏకాభిప్రాయం
అనంతరం మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసంలో మరోసారి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఈ చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
వివరాలు
అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
మెట్రో ఫేజ్-1ను విస్తరించి ఫేజ్-2గా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మొదటి నుంచే అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాటిని అధిగమించేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగించారు. మెట్రో ఫేజ్-1 పూర్తి కావడంలో జాప్యం, కొవిడ్ ప్రభావం తదితర కారణాలతో ఎల్‌అండ్‌టీ సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను సృష్టించినప్పటికీ, ప్రతి ఏడాది రూ.400 కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయని సంస్థ ప్రభుత్వానికి నివేదించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కారణాలతో మెట్రో రెండో దశ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్-1ను ఎల్‌అండ్‌టీ నుంచి రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసింది.
వివరాలు
రుణాల బదిలీపై చర్చలు
ఫలితంగా మెట్రో మొదటి దశ నిర్వహణతో పాటు రెండో దశ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. మెట్రో ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ బ్యాంకుల నుంచి 8.25 శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తక్కువ వడ్డీతో నిధులు సమీకరించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)ను మధ్యవర్తిగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ ద్వారా 4 శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల నిధులను సమీకరించారు. ఆ నిధులు ఐఆర్‌ఎఫ్‌సీకి చేరగా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల వాటాను కూడా చెల్లించింది.
వివరాలు
రైల్వే మంత్రితో సమావేశం
అయితే ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి నిధుల విడుదలలో జాప్యం ఏర్పడటంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి తాను ఎప్పుడూ అడ్డంకిగా నిలవనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. సంబంధిత ఒప్పందాలు, పత్రాలతో సమావేశానికి హాజరై అన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
వివరాలు
కిషన్‌రెడ్డి చొరవతో కీలక సమావేశాలు
ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ చర్చల ఫలితంగా మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వివరాలు
కీలక నిర్ణయాలు
మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఫేజ్-2 విస్తరణ, ఇతర ఆర్థిక అంశాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్ర అధ్యయనం చేపడుతుంది. సంస్థ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమన్వయ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. అధ్యయన ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ఈ ఇద్దరు అధికారులు సమన్వయంతో పనిచేస్తారు.
వివరాలు
సానుకూల వాతావరణంలో చర్చలు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ మెట్రో అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌లతో జరిగిన సమావేశాలు సానుకూల వాతావరణంలో సాగాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ''రైల్వే శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారు. గత రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశాను. ముఖ్యమంత్రితో కలిసి ఆ సమావేశాల్లో పాల్గొన్నాను. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను'' అని కిషన్‌రెడ్డి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.