Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఇప్పటివరకు ప్రైవేటు భాగస్వామ్య విధానంలో(పీపీపీ)కొనసాగుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ చివరి దశకు చేరింది. దీనికి సంబంధించిన వాటా కొనుగోలు ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ సంస్థ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యం సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. ఈప్రక్రియకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన మెట్రో రైలు సంస్థ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఒప్పంద సంతకాల కోసం ఎల్ అండ్ టీ ఛైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. ఈనెల 30తేదీ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఒప్పంద పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
వివరాలు
రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం
ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఉన్న రూ.13,615కోట్ల అప్పును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనుంది. ఈమొత్తాన్ని రైల్వే ఆర్థిక సంస్థ నుంచి తక్కువ వడ్డీతో రుణంగా తీసుకుని తిరిగి చెల్లింపు కాలాన్ని సవరించనుంది. అదనంగా నగరఅభివృద్ధి సంస్థ ద్వారా రూ.1,385కోట్లను మూలధనంగా ఎల్ అండ్ టీకి చెల్లించనుంది. మార్చి 31నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ, రైల్వే ఆర్థిక సంస్థ నుంచి రుణం ఆలస్యంగా మంజూరు కావడంతో ఏప్రిల్ 30వరకు పొడిగించబడింది. బుధవారం లేదా గురువారం ఈఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మెట్రో మొదటి దశలో ప్రైవేటు భాగస్వామ్య విధానం ముగిసి,అది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగా మారనుంది.