Telangana: మార్చిలోగా ప్రభుత్వం చేతికి మెట్రో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఫేజ్-2
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రానుంది. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి, మార్చి నెలలోగా స్వాధీన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను కార్యదర్శుల కమిటీకి అప్పగించారు. స్వాధీనానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ముందుకు వచ్చిందని, ఈ నెల 27 నాటికి రుణ నిబంధనలు వెల్లడించనున్నట్లు సమాచారం.
వివరాలు
2026 నవంబరు 27తో ముగియనున్న కియోలిస్ సంస్థ ఒప్పంద కాలం
స్వాధీన చర్యలతో పాటు మెట్రో రైలు ఫేజ్-2ఏ, 2బీ ప్రాజెక్టులకు అనుమతి పొందేందుకు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖతో రాష్ట్ర పురపాలకశాఖ చర్చలు జరిపి ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మెట్రో నిర్వహణ చేస్తున్న కియోలిస్ సంస్థ ఒప్పంద కాలం 2026 నవంబరు 27తో ముగియనుంది. అయితే స్వాధీనం పూర్తయ్యాక కూడా మరో ఏడాది పాటు అదే సంస్థ ద్వారా నిర్వహణ కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు.
వివరాలు
కార్యదర్శుల కమిటీ నివేదిక కీలకం
మెట్రో రైలును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే అంశంపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తన నివేదికలో రెండో దశ ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగాలంటే తొలి దశ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అలా చేస్తేనే సంస్థ భవిష్యత్తు స్థిరంగా ఉండగలదని అభిప్రాయపడింది. మెట్రో విధానం-2017, ఫేజ్-2 అనుమతులకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ విధించిన నిబంధనలు, ప్రపంచవ్యాప్తంగా మెట్రో వ్యవస్థల అనుభవాలు, వేర్వేరు యాజమాన్యాల కింద ప్రాజెక్టుల నిర్వహణ పరిస్థితులు, ప్రయాణికుల సేవా ప్రమాణాలు, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించింది.
వివారాలు
కార్యదర్శుల కమిటీ నివేదిక కీలకం
ఎల్‌అండ్‌టీ మెట్రోరైలులోని మొత్తం వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసి స్వాధీనం చేసుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. స్వాధీన ప్రక్రియ ఆలస్యమైతే ఫేజ్-2 ప్రాజెక్టు వ్యయం ప్రతి సంవత్సరం సుమారు 5 శాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డెఫినెటివ్ ఒప్పందంపై ఎల్‌అండ్‌టీ సంతకం చేయకపోవడంతో యాజమాన్య విభజన సాధ్యంకాదని కమిటీ పేర్కొంది. అందువల్ల ఆస్తులు, వ్యాపారాన్ని వేరు చేయకుండా సంస్థలో ఈక్విటీని నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుత అప్పులు, బీటీఏ నిబంధనలు, ఫలక్‌నుమా కారిడార్‌కు సంబంధించిన అడ్డంకులు, కేంద్రం నుంచి రావాల్సిన వీజీఎఫ్ బకాయిలు ఉన్న విషయాలను కూడా కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
వివరాలు
స్వాధీనానికి కారణాలేమిటి?
నగర జనాభా వేగంగా పెరుగుతుండటం, నగర విస్తరణ పెరగడం దృష్ట్యా మెట్రో సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్-2ఏ కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని, ఫేజ్-2బీ కింద రూ.19,579 కోట్లతో 86.1 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక అధికారి పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఫేజ్-1 ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితిలో ఫేజ్-2ఏ, 2బీ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్వహిస్తాయి? ఆదాయాన్ని ఎలా పంచుకుంటారు? అనే ప్రశ్నలు లేవనెత్తారు.
వివరాలు
స్వాధీనానికి కారణాలేమిటి?
అదనంగా 2025 జూలైలో జరిగిన సమావేశంలో ఫేజ్-1 నిర్వహణతో పాటు ఫేజ్-2 నిర్మాణ, నిర్వహణ బాధ్యతల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్‌అండ్‌టీ కలిసిన ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ ప్రతిపాదించారు. అయితే ఆ ఒప్పందంలో ఫేజ్-1ను మినహాయించేందుకు వారు అంగీకరించలేదు. అలాగే అధిక వడ్డీతో ఉన్న సుమారు రూ.12 వేల కోట్ల అప్పును తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయాలని కోరారు.
వివరాలు
స్వాధీనానికి కారణాలేమిటి?
తరువాత తాము రవాణా వ్యాపారం నుంచి తప్పుకున్నామని, ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాలోని వాటాను 2024 ఏప్రిల్‌లో ఎడిల్వెస్ సంస్థకు బదిలీ చేసినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసి వివరించారు. వేర్వేరు సంస్థల యాజమాన్యాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.