Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణులతో కలిసి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లిన కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని, దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
మంగళవారం నాడు నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. బుధవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, హైదరాబాద్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.