
Hyderabad: రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లు.. భూవేలంలో సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ భూమి భూవేలంలో చరిత్ర సృష్టించింది. పారిశ్రామిక వృద్ధికి కేంద్రమైన ఈ ప్రాంతంలో,తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఎకరాకు గరిష్టంగా రూ.177కోట్లు పలకడం రాష్ట్ర భూవేలాల చరిత్రలోనే అత్యధికం. ఈ వేలం కింద మొత్తం 18.67ఎకరాల భూమి అమ్మకానికి ఉంచారు.సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19 కింద 11 ఎకరాలు,అదే సర్వే నంబర్‌లో ప్లాట్ నంబర్ 15ఎ2 కింద 7.67 ఎకరాలు ఉన్నాయి. ఒక్కో ఎకరాకు ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించగా,సోమవారం నిర్వహించిన ఈ-వేలంలో 7.67 ఎకరాల భూమిని ఎంఎస్‌ఎన్ సంస్థ ఒక్కో ఎకరాకు రూ.177కోట్లకు కొనుగోలు చేసింది.
వివరాలు
ప్రభుత్వానికి రూ.3,135 కోట్లకు పైగా ఆదాయం
దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,357.59 కోట్ల ఆదాయం లభించింది. మరొక వైపు, 11 ఎకరాల భూమిని ప్రెస్టీజ్ రియాల్టీ సంస్థ ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. దీని ద్వారా రూ.1,556.5 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఈ భూవేలం ద్వారా, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కలిపి ప్రభుత్వానికి రూ.3,135 కోట్లకు పైగా ఆదాయం రాబడిందని టీజీఐఐసీ వెల్లడించింది. ఈ ధర ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించిన భూవేలాల్లో అత్యధికమని సంస్థ పేర్కొంది.
వివరాలు
అన్ని విధాలుగా అనుకూల ప్రాంతం
రాయదుర్గం ప్రాంతం హైటెక్ సిటీ,గచ్చిబౌలి మధ్యలో ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఇది అత్యంత అనుకూల ప్రాంతంగా మారింది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలకు సులభంగా చేరుకునే ఈ ప్రాంతం,ఐటీ,ఐటీఈఎస్,కమర్షియల్,లైఫ్ సైన్సెస్,హెల్త్‌కేర్, రిటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు అనువైన స్థలంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీ మొత్తాలను పెట్టేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ఏర్పాటుకి తర్వాత జరిగిన భూవేలాలను పరిశీలిస్తే, 2017లో రాయదుర్గంలో ఎకరాకు రూ.42.59 కోట్లు, 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికాయి. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రూ.177 కోట్ల రేటు రావడంతో దాదాపు 75శాతం పెరుగుదల నమోదైందని టీజీఐఐసీ ఎండీ శశాంక తెలిపారు.
వివరాలు
తెలంగాణ రైజింగ్-2047
శశాంక మాట్లాడుతూ.. 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్యానికి ఇది బలమైన ముందడుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో రాష్ట్రం పారదర్శక, వ్యాపారానుకూల, అభివృద్ధి ప్రాధాన్య వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది.పెట్టుబడిదారులు, డెవలపర్లు హైదరాబాద్ భవిష్యత్తుపై చూపుతున్న నమ్మకానికి ఈ భూవేలం నిదర్శనం.జేఎల్‌ఎల్ ఇండియా, ఎంఎస్‌టీసీ సంస్థల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఈ వేలాన్ని నిర్వహించాం," అని వివరించారు.
వివరాలు
చింతల్‌లో చ.గ. రూ. 1.14 లక్షలు
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ ప్రాంతంలో నివాస భూములు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. సోమవారం నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం ధర రూ.1.14 లక్షల వరకు చేరింది. 513 చదరపు గజాల హెచ్‌ఐజీ ఓపెన్ ప్లాట్‌కు చ.గ. రూ.80 వేల ఆఫ్‌సెట్ ధర నిర్ణయించగా, చివరికి రూ.1.14 లక్షలకు అమ్ముడైంది. అదే హెచ్‌ఐజీ విభాగంలోని మరో ప్లాట్ చదరపు గజానికి రూ.లక్ష చొప్పున అమ్ముడైంది. ఈ వేలంలో మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్లు అమ్ముడవగా, హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం తెలిపారు. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలంలో చదరపు గజానికి సగటు ధర రూ.91,947గా నమోదైంది.