
Hyderabad: హైదరాబాద్‌కి గ్లోబల్ టేస్టీ అట్లాస్‌లో 50వ స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితులతో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం ఆడో అద్భుతమైన అనుభూతి.. కుటుంబ సభ్యులతో బిర్యానీ తినడం ఒక భావోద్వేగపూరిత అనుబంధం. రంజాన్ సందర్భంగా హలీమ్ రుచి చూడడం ఒక ఆనందకరమైన ఉత్సవం. సందర్భం ఏదైనా, రుచి భరితమైన ఆహారం మన హైదరాబాదీ జీవనశైలికి భాగమైపోయింది. ఇక్కడి ఆహారపు సంస్కృతి స్థానిక చరిత్రను, భౌగోళిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని టాప్ 100 ఫుడ్ డెస్టినేషన్ నగరాల జాబితాలో భాగ్యనగరం హైదరాబాదు 50వ స్థానం దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఇటీవల టేస్టీ అట్లాస్ వెలువరించిన ఈ జాబితాలో ఇది స్పష్టమైంది.
వివరాలు
ఫుడ్ లవర్స్‌కు హైదరాబాదు - రుచుల స్వర్గధామం
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో ఆహార ప్రియులకు ఒక ఆకర్షణీయ కేంద్రంగా నిలిచింది. సాంస్కృతిక వైవిధ్యం కలగలిసిన అద్భుతమైన వంటకాల సమాహారం ఇక్కడ ప్రత్యేకత. ఈ నగరపు ఆహార అలవాట్లు నగర చరిత్రను, భౌగోళిక పరిస్థితులను బలంగా ప్రతిబింబిస్తాయి. అందరిలో ఆదరణ పొందిన హైదరాబాదీ బిర్యానీతోపాటు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయ వంటకాలు ప్రత్యేకత కలిగినవే. అలాగే ఉత్తరాది వంటల ఘుమఘుమలు, ఇరానీ, అరబ్బీ, మొఘల్, పర్షియన్, టర్కిష్ వంటకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటాలియన్, కాంటినెంటల్, అమెరికన్, మెక్సికన్, చైనీస్ వంటకాలూ ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్నాయి. హలీమ్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, డబుల్ కా మిఠా లాంటి ప్రత్యేకతలు ఈ నగర ఆహార రంగాన్ని మరింత రుచికరంగా, విస్తృతంగా మార్చాయి.
వివరాలు
చరిత్రను ఆదర్శంగా తీసుకున్న వంటల సంప్రదాయం
నిజాం పాలనలో హైదరాబాదుకు వచ్చిన పర్షియన్, టర్కిష్ వలసల ప్రభావం స్థానిక తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో కలసి ప్రత్యేకమైన రుచి ప్రపంచానికి అందించాయి. ఈ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దక్షిణాది వంటకాల్లో ఉత్తరాది ప్రభావం కలగలిసింది. ఇతర నగరాలతో పోలిస్తే, అన్ని రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉండటం, తక్కువ ఖర్చుతో అధిక రుచి అందడం హైదరాబాద్ ప్రత్యేకతగా నిలుస్తోంది. అయితే శుభ్రత విషయంలో మరింత అభివృద్ధి కావలసిన అవసరం ఉందని ఆహార ప్రియులు అభిప్రాయపడుతున్నారు.