LOADING...
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం
శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం

Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన 'ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్' సదస్సులో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) మెట్రో నగరాల గాలి నాణ్యత వివరాలను ప్రకటించింది. గతంతో పోలిస్తే వాయు కాలుష్యం కొంత తగ్గినట్టు కనిపిస్తున్నా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన ప్రమాణాలకు మాత్రం ఇంకా మించి ఉందని అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

హైదరాబాద్‌లోనే అత్యధిక కాలుష్యం

డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాలు గరిష్ఠంగా 40 మైక్రోగ్రాములు (ఎంజీ) వరకు మాత్రమే ఉండాలి. అయితే హైదరాబాద్‌లో ఈ స్థాయి రెట్టింపు దాటి 82 నుంచి 88 ఎంజీల వరకు నమోదవుతోంది. సీపీసీబీ నిర్ణయించిన 60 ఎంజీ పరిమితితో పోల్చినా నగరంలో వాయు కాలుష్యం సుమారు 35 శాతం ఎక్కువగానే ఉందని పీసీబీ వెల్లడించింది. దక్షిణాదిలోని మూడు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధిక కాలుష్యం ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో నగరంలో పీఎం-10 స్థాయి కనిష్ఠంగా 80 ఎంజీగా, గరిష్ఠంగా 105 ఎంజీగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

వివరాలు 

ట్రాఫిక్ కారిడార్‌లు హాట్‌స్పాట్లుగా మారాయి

ఐఐటీ కాన్పూర్‌ గతంలో చేసిన అధ్యయనం ఆధారంగా హైదరాబాద్‌లో ఏడు కాలుష్య హాట్‌స్పాట్లను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టినట్టు పీసీబీ తెలిపింది. ఖైరతాబాద్-కోఠి, జీడిమెట్ల, బీహెచ్‌ఈఎల్‌-అమీర్‌పేట, నాంపల్లి-చార్మినార్, మెహిదీపట్నం-హైటెక్‌సిటీ-కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌-సైనిక్‌పురి, ఎల్‌బీనగర్‌-కోఠి ప్రాంతాలు ప్రధాన హాట్‌స్పాట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఎక్కువగా మధ్యస్థం, సంతృప్తికర స్థాయిలోనే కొనసాగిందని పీసీబీ వివరించింది. అయితే ఏడాది మొత్తం మీద ఒక్కరోజు కూడా గాలి నాణ్యత 'స్వచ్ఛమైన గాలి' స్థాయికి చేరలేదని గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement