Bullet Train Corridor: 3 గంటల్లో హైదరాబాద్-ముంబయి.. హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గానికి రూపురేఖలు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 12 గంటలు, రైల్లో ప్రయాణిస్తే సుమారు 15 గంటల సమయం పడుతోంది. అయితే త్వరలో ఈ ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. గంటకు గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి ముంబయికి కేవలం మూడు గంటల్లో చేరుకునేలా హైదరాబాద్-పుణె-ముంబయి హైస్పీడ్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తికాగా, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
వివరాలు
13 చోట్ల కొండలను తొలిచి సొరంగ మార్గాలు ఏర్పాటు
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి ముంబయికి కనిష్ఠంగా 2 గంటల 55 నిమిషాలు, గరిష్ఠంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకునే వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ హైస్పీడ్ మార్గంలో అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. మహారాష్ట్ర పరిధిలో మూడు ప్రాంతాల్లో మొత్తం 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 13 చోట్ల కొండలను తొలిచి సొరంగ మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సొరంగాల మొత్తం పొడవు 24 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ మెట్రో తరహాలోనే పిల్లర్లపై ఈ హైస్పీడ్ మార్గాన్ని నిర్మించనున్నారు. కొండలు, నదులు, భూగర్భ ప్రాంతాల గుండా ఈ మార్గం సాగనుండటం ప్రాజెక్టుకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
వివరాలు
వికారాబాద్, హైదరాబాద్ కోకాపేట ప్రాంతాల్లో స్టేషన్ల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించింది. వాటిలో హైదరాబాద్ నుంచి మూడు మార్గాలు ఉండటం విశేషం. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలు ఇంకా సర్వే దశలో ఉండగా, హైదరాబాద్-పుణె-ముంబయి ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తయ్యి, సమగ్ర నివేదిక సిద్ధమైంది. మొత్తం 671 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, 457 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉండనున్నాయి. ఈ మార్గంలో తెలంగాణలో వికారాబాద్, హైదరాబాద్ కోకాపేట ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలో కలబురిగి స్టేషన్ ఉండగా, మహారాష్ట్రలో విఖ్రోలి, థానే, నవీ ముంబయి, లోనావాలా, పింప్రిచించ్వాడ్, పుణె, బారామతి, పంఢర్‌పుర్, సోలాపూర్ ప్రాంతాల్లో రైలు ఆగనుంది.
వివరాలు
విమానాశ్రయానికి సమీపంలో స్టేషన్ ఏర్పాటు
బుల్లెట్ రైలు స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో స్టేషన్‌కు భవనాలు, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం సుమారు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారులు భూముల కోసం కోరారు. రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌లతో జరిగిన సమావేశాల్లో ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. మొదట కోకాపేట, వికారాబాద్‌లలో మాత్రమే స్టేషన్లను ప్రతిపాదించగా, తాజాగా శంషాబాద్‌ను కూడా చేర్చారు. విమానాశ్రయానికి సమీపంలో స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వికారాబాద్,కోకాపేట స్టేషన్ల నిర్మాణాలకు అవసరమైన భూములతో పాటు డిపో నిర్మాణానికి కూడా విస్తారమైన స్థలం అవసరమని అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రాజెక్టు మార్గంలో మొత్తం 101 వంతెనలు
ఈ ప్రాజెక్టు మార్గంలో మొత్తం 101 వంతెనలను నిర్మించనున్నారు. వాటిలో 13 ఉక్కు వంతెనలు ఉంటాయి. ప్రధాన నదులపై 29 భారీ వంతెనలను ప్రతిపాదించారు. ములా-ముఠా నదిపై 360 మీటర్ల పొడవైన వంతెన, భీమా నదిపై 280 మీటర్ల వంతెన, బోరి నదిపై 225 మీటర్ల వంతెన నిర్మించనున్నారు. ప్రయాణికుల రాకపోకలపై కూడా అంచనాలు రూపొందించారు. ప్రారంభ సంవత్సరంలో రోజుకు 63,494 మంది ప్రయాణిస్తారని, 2041 నాటికి ఈ సంఖ్య 95,050కు, 2051 నాటికి 1,22,727కు, 2061 నాటికి 1,52,092కు పెరుగుతుందని భావిస్తున్నారు. వికారాబాద్ హైస్పీడ్ స్టేషన్‌కు 2.3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్, మూడు కిలోమీటర్ల దూరంలో పట్టణం ఉంది.
వివరాలు
ఒక్కో బుల్లెట్ రైలులో 16 బోగీలు
అక్కడి భూమి పూర్తిగా ప్రైవేటు ఆధీనంలో ఉంది. కోకాపేట స్టేషన్‌కు ప్రతిపాదిత మెట్రో నిలయం అర కిలోమీటర్ దూరంలో ఉండగా, బయటి వలయ రహదారి అత్యంత సమీపంలో ఉంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భూములు రెండూ ఉన్నాయి. ఒక్కో బుల్లెట్ రైలులో 16 బోగీలు ఉండనున్నాయి. ఒకేసారి 1,215 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం మహారాష్ట్రలోని థానేలో భారీ డిపో, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో మరో డిపో నిర్మించనుండగా, ముంబయిలో ప్రధాన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.