Loading...
HYDRAA: హైదరాబాద్‌లో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 నుంచి 12 ఎకరాలకు విస్తరణ
హైదరాబాద్‌లో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 నుంచి 12 ఎకరాలకు విస్తరణ

HYDRAA: హైదరాబాద్‌లో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 నుంచి 12 ఎకరాలకు విస్తరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కు చెరువు పునరుద్ధరణపై హైడ్రా (HYDRAA) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పార్కును సందర్శించి, దాదాపు గంటపాటు మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్, సందర్శకులతో నేరుగా మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు చెరువు, పార్కు సమగ్ర అభివృద్ధికి సంబంధించి వారి నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు.

వివరాలు

3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు చెరువు విస్తరణ

ప్రస్తుతం కేవలం 3 ఎకరాలకే పరిమితమైన కృష్ణకాంత్ పార్కు చెరువును 12 ఎకరాలకు విస్తరించి పునరుద్ధరించాలని హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా చెరువు లోతును పెంచి భారీ మొత్తంలో వరదనీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

అలాగే వరదనీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటిని కృష్ణకాంత్ పార్కు చెరువుకు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రణాళిక అమలైతే కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్‌పేట, మైత్రివనం తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని హైడ్రా భావిస్తోంది.

వివరాలు

పార్కులో సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన వాకర్స్

కమిషనర్ పర్యటన సందర్భంగా వాకర్స్ పార్కులోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. పార్కు దక్షిణం వైపు ఉన్న చెత్త డంపింగ్ యార్డు నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన ప్రహరీ గోడ లేకపోవడంతో చెత్తాచెదారం పార్కులోకి వస్తోందని తెలిపారు. అలాగే పార్కులో పాడైపోయిన జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు.

తమ్మిడికుంట తరహాలో కృష్ణకాంత్ పార్కులోనూ ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చెరువు పునరుద్ధరణతో పాటు పార్కును కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

నగరంలో హైడ్రా ఇప్పటికే పునరుద్ధరించిన చెరువుల అభివృద్ధి తీరును ఈ సందర్భంగా వాకర్స్ ప్రశంసించారు.

ADVERTISEMENT