పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో టెస్టు చేయించకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. హర్యానాలోని మెహమ్‌లో ఆదివారం జరిగిన ఖాప్ పంచాయితీ సమావేశంలో రెజ్లర్లు ఈ మేరకు తీర్మానం చేశారు. అయితే దీనిపై స్పందించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, నార్కో టెస్టుకు తాను సిద్ధమే అని ప్రకటించారు. దీనికి ఒక షరతును విధించారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా నార్కో టెస్ట్‌కు సిద్ధమైతే, తాను కూడా పరీక్షలు చేయించుకుంటానని బ్రిజ్ భూషణ్ చెప్పారు. ఈ మేరకు ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌కు వ్యతిరేకంగా బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌తో సహా పలువురు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఏప్రిల్ నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అతనిని అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెజ్లర్ల నిరసనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా హర్యానా రైతులు రెజ్లర్లకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో హర్యానాలోని మెహమ్‌లో జరిగిన ఖాప్ పంచాయితీ సమావేశంలో సింగ్ నార్కో టెస్ట్ చేయించుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ భూషణ్ మాత్రం తాను ఎలాంటి తప్పులు చేయలేదని, తనను తనను ఇరికించారని ఆరోపించారు.