
Chandrababu: దుబాయ్ అభివృద్ధి చూస్తుంటే అసూయగా ఉంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన 'ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ' సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, దుబాయ్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. 'ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. అక్కడ బీచ్‌లు, ఎడారి ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్నాయి. ఆ అభివృద్ధిని చూస్తే నాకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధిలో భారతదేశం కూడా భాగస్వామిగా ఉండటం సంతోషదాయకం. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
Details
మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారే అవకాశం
కొత్త ఆలోచనలు చేస్తేనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 40 శాతం మంది భారతీయులే ఉన్నారని ఆయన అన్నారు. అలాగే.. ''1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ విప్లవం తర్వాత దేశం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌కు అపార అవకాశాలు దక్కాయి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారే దిశగా పయనిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రభుత్వం రూపొందించిన విజన్ 2020 ప్లాన్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన బాటవేసిందని తెలిపారు.
Details
ప్రజలు కార్యాలయ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు
''2026 జనవరిలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. ప్రజల సంక్షేమానికి గాను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికీ 575 ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం. ఇకపై ప్రజలు కార్యాలయాలు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తాం. ఇది మెరుగైన సాంకేతికతతో అద్భుతాలను సృష్టించే కాలం. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు హాజరై పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.