Ambati Rambabu: నన్ను అరెస్ట్ చేసినా భయం లేదు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆ ఫ్లెక్సీని చించేందుకు తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా బూతులు తిట్టలేదని, తనను తిట్టిన వారికే ప్రతిస్పందనగా అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. గుంటూరులోని తన నివాసం ముందు ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, ఈ వయస్సులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంగీకరించారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని, తనను అరెస్ట్ చేస్తారని తనకు తెలుసని తెలిపారు. అయినా 'ఐ డోంట్ కేర్. అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి. నేను సిద్ధంగా ఉన్నానంటూ ధీమా వ్యక్తం చేశారు.
Details
నన్ను అడ్డుకొని బూతులు తిట్టారు
తనపై జరుగుతున్న విమర్శలన్నింటికీ తాను సమాధానం చెబుతానని చెప్పారు. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక వచ్చిందని గుర్తు చేశారు. అయినా తామే ఏదో తప్పు చేసినట్టు ఫ్లెక్సీలు కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీలను తీసేయాలని తాను గౌరవంగా కోరానని చెప్పారు. ఈరోజు కూడా ఫ్లెక్సీలు చించడానికి నేను వెళ్లలేదు. వెంకన్న గుడికి పూజలు చేయడానికి మాత్రమే వెళ్లాను. కానీ నేను వెళ్లే దారిలోనే నన్ను అడ్డుకొని బూతులు తిట్టారు. వాళ్లు తిట్టారు కాబట్టే నేనూ తిట్టాను. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా తిట్టలేదు. ఆయన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నేను ఎందుకు తిడతాను? ఆయన పెద్ద నాయకుడు, అలా మాట్లాడి ఉండకూడదు.
Details
అరెస్టులను తాను లెక్కచేయను
కానీ నాపై దాడి చేశారు కాబట్టే అలా మాట్లాడాల్సి వచ్చింది. అది అనుకోకుండా జరిగిపోయింది. చంపడానికి వస్తే నేను గావు కేక పెట్టాను అంతేనని అంబటి వివరించారు. తనను అరెస్ట్ చేయాలనుకుంటే దమ్ముంటే చేసుకోవాలని సవాల్ విసిరారు. అరెస్టులను తాను లెక్కచేయనని, అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాడ్లు, కర్రలతో దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. తమను కొట్టడానికి వచ్చే వారికి రక్షణ కల్పిస్తారా అని నిలదీశారు. "మీ రెడ్ బుక్‌ను నా కుక్క కూడా లెక్కచేయదు. నేను పారిపోను.. బెయిల్‌కు వెళ్లను. ఇంతమంది పోలీసులు ఉండి కూడా మాపై దాడి చేసిన వారిని వదిలేసి మమ్మల్నే అరెస్ట్ చేస్తారా?" అంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.