I.N.D.I.A : ఇండియా కూటమి సీట్ల పంపకం ఇంకెప్పుడు.. ఇప్పటికే 53 రోజులు గడిచింది
భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీల అలయెన్స్ ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ మేరకు చర్చలపై అలసత్వానికి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ కారణమని కూటమిలోని రెండు పార్టీలు అంటున్నాయి. భారత కూటమి భాగస్వాముల మధ్య దిల్లీలో సీట్ల భాగస్వామ్య చర్చలు ఇంకా మొదలుకాలేదు. గత ఆగస్టు 31, సెప్టెంబర్ 1లో కూటమి ముంబై వేదికగా సమావేశమైంది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్యం, సర్దుబాటు అంశంపై వెంటనే ఏర్పాట్లు ప్రారంభిస్తామని ముంబై సదస్సులో చెప్పారు. ఆ భేటీ జరిగి 53 రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ సీట్ల పంపకాలు మొదలుకాకపోవడం గమనార్హం.
రాష్ట్రాల ఎన్నికల తర్వాతే చర్చలు ఉండొచ్చు
మరోవైపు వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ ఉత్సాహంగా ఎదురుచూస్తోందని,ఈ క్రమంలోనే తమ సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు కూటమిలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. సీట్ల పంపకాలపై చర్చలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని సోమవారం మధ్యాహ్నం ఆయన అంగీకరించారు. చర్చలకు గడువు ఇవ్వలేదు కనుక, రాష్ట్రాల ఎన్నికల తర్వాత చర్చల ప్రక్రియ ప్రారంభించవచ్చన్నారు. తాము 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో 3 లేదా 4 రాష్ట్రాలు గెలిస్తే, మిత్రపక్షాలతో కలిసి సీట్లపై చర్చించేందుకు మంచి అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయమని ముంబైలో ఏర్పాటైన సబ్‌కమిటీకి చెందిన ఓ నాయకుడు అన్నారు. కానీ ఒకటి లేదా రెండు రాష్ట్రాలు మాత్రమే వస్తే, సీట్ల చర్చల్లో కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగిస్తుందిన్నారు.