
INDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా కూటమికి (I.N.D.I.A) ఊహించిన ఎదురుదెబ్బ తగలనుంది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా) నుంచి కీలకమైన సీపీఎం దూరం కానుంది.
పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విపక్షాల కూటమికి అంటిముట్టనట్టుగా ఉండాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బెంగాల్‌లో అధికార టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన ప్రత్యర్థులుగా సీపీఎం భావిస్తోంది. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదనే వైదొలగకుండా, దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం.
దిల్లీలో ఈ వారాంతంలో జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో భేటీలో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
DETAILS
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సీపీఎం సమదూరం
మరోవైపు ఎన్డీఏకు వ్యతిరేకంగా జరిపే సమావేశాలకు ప్రతినిధులను పంపకూడదని పార్టీ తీర్మానించింది.
ఈ మేరకు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సమదూరం పాటించనుంది. సీపీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ(NATIONAL DEMOCRATIC ALLIANCE) కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేయనుంది.
తాజా రాజకీయ పరిణామంతో సీపీఎం వైదొలగడం విపక్షాల అనైక్యతకు కారణంగా నిలుస్తోంది.
సీపీఎం వైఖరిపై కూటమిలోని ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.