LOADING...
I-PAC: ఈడీ చర్యల నేపథ్యంలో బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్

I-PAC: ఈడీ చర్యల నేపథ్యంలో బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి ఉత్కంఠ తారస్థాయికి చేరుకున్న సమయంలో, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహ సహాయం అందిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తన కార్యకలాపాలను గణనీయంగా తగ్గించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. క్షేత్రస్థాయి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిన సంస్థ, పలు విభాగాల సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. ఇటీవల సంస్థ డైరెక్టర్ వినేష్ చాందెల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం,అలాగే సంస్థ నాయకత్వాన్ని పలుమార్లు విచారణకు పిలవడం వల్ల న్యాయపరమైన ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సంస్థ తన పనితీరును పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 18న సిబ్బందితో మాట్లాడిన యాజమాన్యం, న్యాయపరమైన కారణాల వల్ల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

వివరాలు 

సేవలు కొనసాగుతున్నాయని, ఎవరికీ నష్టం జరగదని టీఎంసీ హామీ

అధికారిక ఈ-మెయిల్స్ వినియోగం నిలిపివేయాలని, బయటి వ్యక్తులతో సంబంధాలు తగ్గించాలని సూచించింది. ఎన్నికల సమయంలో కీలకంగా ఉన్న ఐప్యాక్ వాట్సాప్ సమూహాలు శనివారం నుంచి నిశ్శబ్దంగా మారడం ఈ పరిణామాలకు బలం చేకూరుస్తోంది. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ ప్రచార వ్యవస్థను దెబ్బతీసేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించింది. మొదట ఐప్యాక్ సేవలు నిలిచిపోయాయని వచ్చిన వార్తలను ఖండించినప్పటికీ, తరువాత పార్టీ నాయకులు ఆచితూచి స్పందించారు. రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ, "మేం పలు ఏజెన్సీలతో కలిసి పనిచేస్తాం. వారిలో పనిచేస్తున్న యువ నిపుణుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం రానివ్వం. మా ముఖ్యమంత్రి అందరినీ ఆదుకుంటారని " అని భరోసా ఇచ్చారు.

వివరాలు 

ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల పోలింగ్

అయితే కార్యకలాపాలు తగ్గించినప్పటికీ, ఐప్యాక్ తన సేవలను పూర్తిగా నిలిపివేయలేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రచారానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisement