Shashi Tharoor: ఆ విషయంలో వెనక్కి తగ్గను.. క్షమాపణ కూడా కోరను : శశి థరూర్
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంటులో తాను ఎప్పుడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ అంశంపైనే తనకు పార్టీతో అభిప్రాయ భేదాలు ఉన్నాయని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు వెళ్లిన దౌత్యబృందాల్లో థరూర్ సభ్యుడిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వ్యవహారశైలిపై సొంత పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన థరూర్.. తన వైఖరిని సమర్థించుకుంటూ, ఈ విషయంలో తాను ఎప్పటికీ క్షమాపణ కోరబోనని తేల్చిచెప్పారు.
Details
దేశ ప్రయోజనాలే ప్రధానం
కేరళ లిటరేచర్ ఫెస్టివల్(KLF)లో పాల్గొన్న సందర్భంగా థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor)కు ముందే తాను రాసిన ఓ ఆర్టికల్‌ను ఆయన ప్రస్తావించారు. ఒక రచయితగా పహల్గాం ఉగ్రదాడిపై వ్యాసం రాసినట్టు తెలిపారు. ఉగ్రదాడులకు తగిన స్థాయిలో సైనిక ప్రతిస్పందన ఉండాల్సిందేనని ఆ వ్యాసంలో స్పష్టంగా పేర్కొన్నానన్నారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న భారత్.. పాకిస్థాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణల్లోకి వెళ్లకుండా, ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవాలని తాను రాసినట్టు వెల్లడించారు. ఆ ఆర్టికల్‌లో సూచించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే ప్రధానం కావాలని థరూర్ స్పష్టం చేశారు.