Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే?
బిహార్‌లో వరద బాధితులకు సహాయం చేస్తుండగా ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనతో పైలట్ చాకచక్యంగా చాపర్‌ను వరద నీటిలో ల్యాండింగ్ చేసి, ప్రమాదాన్ని అరికట్టారు. స్థానికులు పడవ సాయంతో వచ్చి నలుగురు ఐఏఎఫ్ సిబ్బందికి సాయం చేశారు. ఇందులో ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని, కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు. వీరికి సాయంగా ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.
తప్పిన పెను ప్రమాదం
బుధవారం, భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో పైలట్ మధ్యాహ్నం ముజఫర్‌పూర్‌లోని నయా గావ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ల్యాండింగ్ అనంతరం, హెలికాప్టర్ కొంత భాగం వరద నీటిలో మునిగిపోయింది. అయితే పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ పేర్కొన్నారు. ఇంజిన్ విఫలమైనప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పైలట్‌కు లోతులేని నీటిలో ల్యాండింగ్ చేసేందుకు సూచనలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు ప్రారంభించాయని తెలిపారు.