IAS Academy Director: ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌కు కిడ్నాప్ షాక్.. తుపాకీతో బెదిరించి రూ.1.89 కోట్లు దోపిడి
ఈ వార్తాకథనం ఏంటి
వ్యాపార భాగస్వామి చేతిలోనే ఘోర ద్రోహం ఎదుర్కొన్న ఓ ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సంస్థ డైరెక్టర్‌కు భోపాల్‌లో నడిచిన ఈ కిడ్నాప్ డ్రామా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న నిందితుడు, ఆమెను మోసం చేసి పిలిపించి, తుపాకీ బెదిరింపులతో గంటల తరబడి బంధించి రూ.1.89 కోట్లు దోచుకున్న ఘటన క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'శుభ్రా రంజన్ ఐఏఎస్ అకాడమీ' డైరెక్టర్ శుభ్రా రంజన్‌ను, అదే సంస్థకు భోపాల్‌లో ఫ్రాంచైజీ నిర్వహిస్తున్న ప్రియాంక్ శర్మ మాయమాటలతో భోపాల్‌కు రప్పించాడు. నగరంలో కొత్త సెంటర్ ప్రారంభం, సెమినార్ నిర్వహణ పేరుతో నమ్మబలికాడు.
వివరాలు
1.89 కోట్లు బదిలీ చేయాలని ఒత్తిడి
ఈ మేరకు ఆమె భోపాల్ చేరుకోగా, బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆమె బస చేస్తున్న5-స్టార్ హోటల్ నుంచి తన కారులో తీసుకెళ్లి బాగ్‌సేవానియా ప్రాంతంలోని ఓ అద్దె ఫ్లాట్‌కు తరలించాడు. అక్కడికి ముందుగానే సాయుధ వ్యక్తులను ఏర్పాటు చేసిన ప్రియాంక్, ఫ్లాట్‌లోకి వెళ్లగానే శుభ్రా రంజన్‌తో పాటు ఆమె సహాయకులను బంధించాడు. దాదాపు నాలుగు గంటల పాటు తుపాకీతో బెదిరిస్తూ, 'జనక్షిలా సొసైటీ', 'ఆర్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్' పేర్లతో ఉన్న ఖాతాలకు రూ.1.89కోట్లు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. బాధితుల కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు నిందితులు అదే ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం నిర్వహించడం ఈ ఘటనలో అత్యంత సంచలనంగా మారింది. బాధితుల గొంతును అణచివేయడానికి చేసిన నాటకమని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
భయపెట్టేందుకు నకిలీ వీడియోలు చిత్రీకరణ
ఇంతటితో ఆగకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టేందుకు నిందితులు నకిలీ వీడియో కూడా చిత్రీకరించారు. అందులో ఓ వ్యక్తిని తాళ్లతో కట్టి బాక్స్‌లో బంధించినట్లు చూపించి, ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. వెంటనే సంతోష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందడంతో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడి, వేగంగా స్పందించింది. నిందితులు డబ్బు బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాలను గంటల్లోనే స్తంభింపజేయడంతో రూ.1.89 కోట్లు సురక్షితంగా నిలిచాయి. అరెస్ట్ తప్పదని గ్రహించిన ప్రధాన నిందితుడు ప్రియాంక్ శర్మ విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించగా అది విఫలమైంది.
వివరాలు
ఆస్పత్రి బెడ్‌పైనే అరెస్టు
అనంతరం అనారోగ్యం నటిస్తూ భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరాడు. అయితే ఖచ్చితమైన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్యులతో సంప్రదించి అతని ఆరోగ్యం సవ్యంగా ఉందని నిర్ధారించుకుని, ఆసుపత్రి బెడ్‌పైనే అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని తల్లి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రియాంక్‌ను విచారించిన అనంతరం మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, మొత్తం ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈనేరానికి ఉపయోగించిన కారు, మొబైల్ ఫోన్, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంక్ భార్య పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. దోపిడీకి గురైన మొత్తాన్ని బాధితురాలికి తిరిగి అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.