LOADING...
Vishakhapatnam: విశాఖలో మళ్లీ అడుగుపెడుతున్న ఐబీఎం.. మూడు ఏళ్లలో రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యం
మూడు ఏళ్లలో రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యం

Vishakhapatnam: విశాఖలో మళ్లీ అడుగుపెడుతున్న ఐబీఎం.. మూడు ఏళ్లలో రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం మళ్లీ విశాఖపట్టణం నగరంలో అడుగుపెడుతోంది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)లో తాజాగా నమోదు చేసుకుని తన కార్యకలాపాల ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఎస్‌టీపీఐ ఎక్స్‌ వేదికగా 'వెల్కమ్ ఐబీఎం' అంటూ స్వాగతం పలికింది. విశాఖను కేంద్రంగా చేసుకుని వచ్చే మూడేళ్లలో ఐబీఎం రూ.321 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. కంపెనీ రాకతో స్థానికంగా 502 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. నగరంలో అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసి, కార్యాలయ భవనం నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

వైసీపీ పాలనలో విశాఖకు వీడ్కోలు

వైసీపీ ప్రభుత్వ కాలంలో విశాఖను విడిచిపోయిన ప్రముఖ ఐటీ సంస్థల్లో ఐబీఎం కూడా ఒకటి. గతంలో రుషికొండ హిల్-3 ప్రాంతంలో కెనెక్సా సంస్థకు 25 ఎకరాల భూమిని కేటాయించగా, ఆ సంస్థను తరువాత ఐబీఎం స్వాధీనం చేసుకుంది. అయితే అధిక ఉపాధి కల్పన నిబంధనల నేపథ్యంలో తమ అవసరానికి కేవలం 3.20 ఎకరాలు సరిపోతాయని పేర్కొంటూ మిగిలిన 21.80 ఎకరాలను ఏపీఐఐసీకి తిరిగి అప్పగించింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో తన భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి, విశాఖ కార్యకలాపాలను ముగించింది. ఐబీఎం తిరిగి ఇచ్చిన ఆ 21.80 ఎకరాల భూమిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాజాగా టీసీఎస్‌కు కేటాయించింది.

వివరాలు 

ఇన్ఫోసిస్‌కు శాశ్వత క్యాంపస్ దిశగా అడుగులు

విశాఖ ఐటీ హిల్స్‌లో ప్రైవేట్ భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ, శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం భూమి కేటాయించాలని ఇటీవల ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనిపై స్పందించిన అధికారులు ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ కేటాయింపుపై ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement