
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాం.. ఏపీ పోలీసు సంఘం వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు వ్యవస్థ నుంచి తీవ్ర స్పందన వచ్చి పడుతోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వేసుకున్న యూనిఫామ్స్ ఊడదీస్తామని ఆయన వ్యాఖ్యానించడంపై పోలీసు అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఫ్యాషన్ షోనా..?
పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు స్పందిస్తూ, "గుడ్డలు ఊడదీయడానికి ఇది ఫ్యాషన్ షోనా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
పోలీసు విభాగం ఎంతో ఒత్తిడితో పని చేస్తున్నదని, అలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు ఈ విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు.
జగన్ తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే, తమకున్న న్యాయపరమైన హక్కులతో పోరాటం చేస్తామని తెలిపారు.
Details
యూనిఫాం ఎవరో ఇచ్చినది కాదు : ఎస్పీ రత్న
సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "పోలీసు యూనిఫాం ఎవరో ఇచ్చినది కాదు. మేము కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి, శిక్షణ పూర్తిచేసి సాధించుకున్నదేనని తెలిపారు.
పోలీసులు సర్వీస్ రూల్స్‌కు కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఎవరికీ అనుకూలంగా కాకుండా న్యాయంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.
వైసీపీ కార్యకర్తలను గుంపులుగా సమీకరించి హెలిప్యాడ్ వద్దకు తరలించారని కూడా వివరించారు.
Details
ఘాటుగా స్పందించిన ఎస్ఐ
జగన్ ఆరోపణలకు లక్ష్యంగా మారిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా స్పందిస్తూ,
'పోలీసు యూనిఫాం అరటితొక్క కాదని, ఎవరి మాటలకైనా ఊడిపోదంటూ కౌంటర్ ఇచ్చారు.
బట్టలు ఊడదీసి కొడతారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించిన సుధాకర్, జగన్‌కు హితవు పలుకుతూ, ఈ యూనిఫాం కష్టపడి చదివి, శారీరక పరీక్షల్లో పాస్ అయ్యి, వేల మంది మధ్య నిలిచిన వాళ్లకు లభించిన గౌరవమన్నారు.
దాన్ని ఇలా తక్కువచేసేలా మాట్లాడడం దారుణమన్నారు.
తాము నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడతామని, అదే విధంగా విధిని నిబద్ధతగా నిర్వర్తిస్తామని, జీవితం అంతా అదే బాటలో సాగుతుందని తెలిపారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.