Telangana: అంకురాలు, ఎంఎస్‌ఎంఈలకు ఊతం.. హైదరాబాద్ ఐఐసీటీలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కేంద్రం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు ప్రయోగశాలలకే పరిమితమవుతున్నాయి. పేటెంట్లు పొందిన ఈ సాంకేతికతలు మార్కెట్‌కి చేరకుండా నిలిచిపోతున్నాయి. మరోవైపు, అంకుర సంస్థలు,సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కొత్త వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ప్రత్యేకంగా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటేషన్ సెంటర్ (టీటీఎఫ్‌సీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం అంకుర సంస్థలు,ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసి, కొత్త సాంకేతికతలను మార్కెట్‌లోకి తీసుకురావడం. ఇందుకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ) ఆర్థిక సహాయం అందించింది.
వివరాలు
బదలాయింపుకు సిద్ధంగా ఉన్న 200 సాంకేతికతలు
ఈ కేంద్రం మేధోసంపత్తి వాణిజ్యీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతికతల బదిలీ, లైసెన్సింగ్ ప్రక్రియల్లో మార్గదర్శకత్వం ఇస్తూ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది. ఇప్పటికే దాదాపు 200 సాంకేతికతలు బదలాయింపుకు సిద్ధంగా ఉన్నాయి. రసాయనాలు, బయోటెక్నాలజీ, ఆగ్రో-ఫుడ్, క్లీన్ ఎనర్జీ, పర్యావరణ రంగాల్లో నిపుణుల సేవలను ఈ కేంద్రం ద్వారా పొందవచ్చు. ఐఐసీటీకి ఉన్న దాదాపు ఎనిమిది దశాబ్దాల అనుభవం, ఆధునిక ప్రయోగశాల సదుపాయాలు కూడా పరిశ్రమలకు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్‌లు నమోదు చేయడంలో సహాయం చేస్తూ వ్యాపార మార్గాలను సులభతరం చేస్తుంది.
వివరాలు
పరిశ్రమ స్థాపించే వారికి పెట్టుబడిలో 70 శాతం తిరిగి వచ్చే అవకాశం
ప్రయోగశాల స్థాయి పరిశోధనలను పారిశ్రామిక వినియోగానికి తీసుకెళ్లడంలో ఐఐసీటీ పూర్తి మద్దతు ఇస్తుందని బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ ఆర్ లిఖార్ తెలిపారు. అదేవిధంగా, టీటీఎఫ్‌సీ ద్వారా సాంకేతికత ఆధారంగా పరిశ్రమ స్థాపించే వారికి పెట్టుబడిలో 70 శాతం వరకు తిరిగి వచ్చే అవకాశముందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.