IIT Guwahati: గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇంధనంగా మార్చే టెక్నాలజీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
పర్యావరణ సంరక్షణకు, స్వచ్ఛమైన ఇంధన తయారీకి దారి తీసేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి శాస్త్రవేత్తలు ఒక ప్రాధాన్యత గల పరిశోధనలో ముందడుగు వేశారు. గాలిలో విస్తరిస్తున్న హానికర కార్బన్ డై ఆక్సైడ్ (CO₂)ను సూర్యకాంతిని వినియోగించి మిథనాల్ ఇంధనంగా మార్చగల నూతన తరహా పదార్థాన్ని.. ఫోటోకాటలిస్ట్‌ను.. వారు విజయవంతంగా రూపొందించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్'లో ప్రచురితమయ్యాయి.
వివరాలు
సూర్యరశ్మిని ఉపయోగించి CO2ను మిథనాల్ ఇంధనంగా మార్పు
పెట్రోలియం ఆధారిత ఇంధనాల అధిక వినియోగం వల్ల వాతావరణంలో CO₂ స్థాయి పెరిగి, పర్యావరణ కాలుష్యం, భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రకృతికి హాని కలగకుండా చూసే పరిష్కారంగా ఈ ఆధునిక సాంకేతికత ఉపయోగపడనుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంట్, ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌ను తిరిగి ఇంధనంగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఇంతకుముందు గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్‌ను ఉపయోగించి ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ, శక్తి వేగంగా నష్టపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు.
వివరాలు
గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్, గ్రాఫీన్ మిశ్రమంతో ప్రత్యేక పదార్థం రూపకల్పన
అయితే, ఐఐటీ గువాహటి పరిశోధకులు గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్‌కు 'ఫ్యూ-లేయర్ గ్రాఫీన్'ను కలపడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించారు. గ్రాఫీన్ మేళవింపు వల్ల ఈ కొత్త మిశ్రమం సూర్యకాంతిని మరింత సమర్థంగా గ్రహించి,శక్తి నష్టాన్ని తగ్గిస్తూ,దీర్ఘకాలం చురుకుగా పనిచేస్తుందని పరీక్షల్లో నిరూపితమైంది. ముఖ్యంగా, 15 శాతం గ్రాఫీన్ కలిగిన సమ్మేళనం అత్యుత్తమ పనితీరును కనబరిచిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన పర్యావరణ సమస్యలను తగ్గించడమే కాకుండా, హరిత ఇంధన ఉత్పత్తికి కీలకంగా మారుతుందని ఐఐటీ గువాహటి కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహుయా దే తెలిపారు. వచ్చే దశలో ఈ సాంకేతికతను పరిశ్రమల స్థాయిలో అమలు చేయగలిగే విధంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పరిశోధక బృందం పేర్కొంది.