LOADING...
Tamil Nādu: స్టార్టప్‌ల హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. 'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం
'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం

Tamil Nādu: స్టార్టప్‌ల హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. 'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు పరిశ్రమల స్థాపనలోనే కాకుండా, స్టార్టప్‌ల నమోదు విషయంలో కూడా ప్రగతి సాధిస్తోంది. రాష్ట్రంలో అంకుర సంస్థలకు పెట్టుబడులు ఆకర్షించే దిశగా 'ఇన్నోవేషన్‌-టీఎన్‌'అనే ప్రత్యేక స్టార్టప్‌ డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డ్యాష్‌బోర్డ్‌ను ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేషన్‌లో పనిచేస్తున్నస్టార్టప్‌ 'వైనాస్‌',రాష్ట్ర పెట్టుబడుల ప్రచారానికి నోడల్‌ ఏజెన్సీగా ఉన్న 'గైడెన్స్‌ తమిళనాడు' కలిసి అభివృద్ధి చేశాయి. ఇది దేశవ్యాప్తంగా తొలిసారిగా తీసుకున్న ప్రయత్నమని అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని స్టార్టప్‌ల ప్రగతి వివరాలు స్పష్టంగా ఉంటాయి. కొత్తగా ఏ స్థాయిలో స్టార్టప్‌లు వస్తున్నాయి,ఏ విధమైన సహకారంతో వాటి సంఖ్య పెరుగుతోంది, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎంత,ప్రభుత్వ పథకాలు ఎంతమందికి చేరాయి,ఏ రంగాల్లో ఎక్కువ వృద్ధి జరుగుతోంది వంటి సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.

స్టార్టప్

నాలుగేళ్లలో 8,593 కొత్త స్టార్టప్‌లు 

తమిళనాడు ప్రస్తుతం స్టార్టప్‌ హబ్‌గా మారుతోంది. ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో 19 వేలకు పైగా స్టార్టప్‌లు కార్యరంగంలో కొనసాగుతున్నాయి. వీటిలో 2.2 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు సమకూర్చిన అంకుర సంస్థలు 45 ఉండగా, మొత్తం స్టార్టప్‌లు కలిపి రాష్ట్రంలో దాదాపు రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నూతన ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 228 ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా 2021 నుండి 2024 మధ్య కాలంలో 8,593 స్టార్టప్‌లు ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, తయారీ, హార్డ్‌వేర్‌-టెక్నాలజీ, ఆహార పదార్థాలు, పానీయాలు వంటి రంగాల్లో ఎక్కువ సంఖ్యలో స్టార్టప్‌లు స్థిరపడ్డాయి.

చెన్నై 

చెన్నైలోనే అత్యధిక స్టార్టప్‌లు 

చెన్నైలో అత్యధికంగా 5,899 స్టార్టప్‌లు ఉండగా,రెండవ స్థానంలో కోయంబత్తూరు (1,962) ఉంది. తరువాత చెంగల్పట్టు (1,560), తిరువళ్లూరు (1,225), కాంచీపురం (531) జిల్లాలు నిలిచాయి. ఈ స్టార్టప్‌ల మూడు సంవత్సరాల కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌రేట్‌ (CAGR) 15 నుంచి 21 శాతం వరకు ఉన్నట్లు గైడెన్స్‌ తమిళనాడు వెల్లడించింది. ఈ కొత్త డ్యాష్‌బోర్డును దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్యను మరింతగా పెంచడానికి ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం పెంచుతున్నామని గైడెన్స్‌ తమిళనాడు అధికారులు స్పష్టంచేశారు.